Begin typing your search above and press return to search.

చెన్నై ‘ఉడిపి’ హోటల్స్ పై తంబీల దాడులు

By:  Tupaki Desk   |   12 Sep 2016 5:43 AM GMT
చెన్నై ‘ఉడిపి’ హోటల్స్ పై తంబీల దాడులు
X
దేశంలో ఎక్కడికి వెళ్లినా కర్ణాటకకు చెందిన హోటల్స్ కనిపిస్తుంటాయి. కన్నడిగులు వీలైనంతవరకూ ఉడిపి బ్రాండ్ నేమ్ తో హోటల్స్ పెడుతుంటారు. మరికొందరు ఉడిపి అన్న పేరుతో కాకున్నా.. కన్నడిగుల హోటల్స్ సెటప్పే కాస్త భిన్నంగా ఉంటుంది. అందులో టిఫిన్స్ రుచి.. వారి స్టైల్ మిగిలిన హోటల్స్ కు మధ్య వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. అంతా బాగున్నప్పుడు ఓకే కానీ.. ప్రాంతాల మధ్య చిచ్చు రేగినప్పుడే ఆవేశానికి గురైన ప్రజలు.. అన్నీ మర్చిపోయి దాడులకు పాల్పడుతుంటారు. ప్రస్తుతం తమిళనాడు రాజధాని చెన్నైలో అలాంటి పరిస్థితే నెలకొంది.

గడిచిన కొద్ది రోజులుగా కర్ణాటక – తమిళనాడుల మధ్య కావేరీ జలాల సమస్య నడుస్తున్న సంగతి తెలిసిందే. కావేరీ జలాల్ని తమిళనాడుకు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించటం.. దీనిపై కర్ణాటకలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తటం తెలిసిందే. రాస్తోరోకోలు.. ధర్నాలు.. బంద్ లతో ఉద్యమం తీవ్రమవుతున్న వేళ.. కొందరు విధ్వంసకారులు రెచ్చిపోయి తమిళనాడుకు చెందిన వాహనాల్ని.. ఆస్తుల్ని టార్గెట్ చేయటంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

కర్ణాటకలో తమ వారి ఆస్తులపై కన్నడవాసుల దాడికి ప్రతిగా చెన్నైలోని కర్ణాటకకు చెందిన హోటల్స్ పై దాడులు చేయటం మొదలైంది. ఈ తెల్లవారుజామున పలు హోటల్స్ పై ఈ తరహా దాడులు జరగటం గమనార్హం. మైలాపూర్ లోని ఉడ్ ల్యాండ్ హోటల్ పై దుండగులు పెట్రోల్ బాంబులతో దాడికి దిగారు. మరికొన్ని కర్ణాటకకు చెందిన హోటల్స్ ను లక్ష్యం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. తాజా పరిణామంతో తమిళనాడులోని కన్నడిగులు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు.

మరోవైపు రామాంతపురం జిల్లాలోనూ కర్ణాటకు చెందిన వాహనాల్ని ధ్వంసం చేసినట్లుగా చెబుతున్నారు. ఈ అంశానికి సంబంధించి అధికారిక సమాచారం ఇంకా విడుదల కాలేదు. ఆందోళనలో భాగంగా ఒక న్యూస్ ఛానల్ వాహనాన్ని కూడా ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. రోజురోజుకి శ్రుతి మించుతున్న ఈ నీటి రగడ.. రెండు రాష్ట్రాల మధ్యం మరెన్ని దారుణాలకు దారి తీస్తుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.