Begin typing your search above and press return to search.

రేపట్నించి సర్కారీ ఆఫీసుల్లా పెట్రోల్ బంకులు

By:  Tupaki Desk   |   4 Nov 2016 6:43 AM GMT
రేపట్నించి సర్కారీ ఆఫీసుల్లా పెట్రోల్ బంకులు
X
మీ బండిలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ అయిపోతుంటే ఏం చేస్తారు? పెట్రోల్ బంక్ ఎక్కడుందో కనుక్కొని వెళతారు. పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందో చూసుకుంటారే తప్పించి.. వాచీలో టైం ఎంతైందన్నది చూడరు. కానీ.. రేపటి నుంచి ఆ పని మొదట చేయాల్సి ఉంది. పెట్రోల్ బంకు యజమానులు చేస్తున్న నిరసన కారణంగా సర్కారీ కార్యాలయాల మాదిరి టైమింగ్స్ లో మాత్రమే పెట్రోల్ బంకులు పని చేయనున్నాయి. తమ కమిషన్ ను పెంచాలని కోరుతూ పెట్రోల్ బంకు యజమానులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే.. వారి డిమాండ్లపై ప్రభుత్వం.. పెట్రోల్ కంపెనీలు సానుకూలంగా స్పందించింది లేదు.

ఈ నేపథ్యంలో నవంబరు 5 నుంచి (అంటే.. రేపటి నుంచి) పెట్రోల్ బంకులు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు మాత్రమే పని చేయనున్నట్లుగా భారతీయ పెట్రోలియం డీలర్ల కన్సార్టియం తాజాగా స్పష్టం చేసింది. అంతేకాదు.. తమ కమిషన్ పెంచే వరకూ ఆదివారం.. పండగ సెలవు దినాలు.. రెండు.. నాలుగు శనివారాల్లోనూ బంకులు మూసి వేయనున్నట్లు వెల్లడించారు. గురువారం నుంచి ఆయిల్ కంపెనీల నుంచి కొనుగోళ్లు నిలిపివేయనున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా.. కొత్త బంకులు ఏర్పాటు చేస్తున్న వారికి పెట్టిన పెట్టుబడికి సరిపడా వడ్డీ కూడా రావటం లేదని.. కమిషన్ పెంచకుంటే నిర్వాహకుల జీవనం కూడా కష్టమవుతుందని పేర్కొన్నారు. వీరి కష్టం సంగతి ఎలా ఉన్నా.. పెట్రోల్ బంకుల యజమానులు తీసుకున్న నిర్ణయం కారణంగా వాహనదారులకు చుక్కలు కనిపించే పరిస్థితి. ఇంతకాలం ఎప్పుడంటే అప్పుడు పెట్రోల్.. డీజిల్ కొట్టించుకునేందుకు అలవాటు పడిన వారంతా.. ఇకపై శ్రద్ధగా పెట్రోల్ ట్యాంకులో పెట్రోల్ ఎంత ఉందన్న విషయాన్ని లెక్కవేసుకొని మరీ ముందే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేనా.. తగ్గించిన పని గంటల కారణంగా.. రేపటి నుంచి పెట్రోల్ బంక్ ల ముందు భారీ క్యూలు దర్శనమిచ్చే అవకాశం ఉంది. సో.. వాహనదారులు పారాహుషార్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/