Begin typing your search above and press return to search.

మోడీ మాష్టారి పాలన ఎంతో గొప్పదో మీకే అర్థమయ్యే లెక్క ఇది

By:  Tupaki Desk   |   10 Dec 2019 5:03 AM GMT
మోడీ మాష్టారి పాలన ఎంతో గొప్పదో మీకే అర్థమయ్యే లెక్క ఇది
X
అలవాటైన విషయమే కానీ.. ఎంత ఓర్చుకుందామన్నా ఓర్చుకోనివ్వకుండా ఇదెక్కడి ఆరాచకమన్న భావన మనసును లాగేస్తోంది. నిత్యవసర వస్తువుగా మారిన పెట్రోల్.. డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. తెలంగాణలో పెట్రోల్ మరో ఇరవై పైసలు పెరిగితే లీటరు రూ.80లను టచ్ చేసేస్తుంది. డీజిల్ ధరలు కూడా తక్కువేం కాదు. లీటరు రూ.72ను దాటేసింది. ఏపీలో లీటరు పెట్రోల్ రూ.79 అయితే.. డీజిల్ రూ.71.02గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.75 అయితే.. డీజిల్ మాత్రం రూ.66.04 పలుకుతోంది.

పెరగటమే తప్ప తగ్గని పెట్రోల్.. డీజిల్ ధరలు ఎందుకింత మండుతున్నాయి.. ధరల పెంపునకు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఏమన్నా భగ్గుమంటున్నాయా? అని చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు కిందకు చూస్తున్నాయి. దేశంలో మాత్రం పెట్రోల్.. డీజిల్ అంతకంతకూ పెరుగుతున్న దుస్థితి.ఇదొక్కటి చాలదా? మోడీ మాష్టారి పాలన ఎలా ఉందో చెప్పటానికి?

మోడీ అధికారంలోకి రాక ముందు.. నమో చేతికి పగ్గాలు చిక్కాలే కానీ లీటరు పెట్రోల్ రూ.50కు తగ్గుతుందని బీరాలు పలికేవారు. గడిచిన పదేళ్లలో అంటే 2009 నుంచి ఇప్పటివరకూ ముడిచమురు ధరల్ని చూస్తే.. ఎప్పుడూ లేనంత కనిష్ఠ ధర బ్యారెల్ 33.63 డాలర్ల ధర 2016 జనవరిలో పలికింది. అంటే.. మూడేళ్ల క్రితమన్న మాట. అప్పుడు కూడా దేశంలో పెట్రోల్.. డీజిల్ ధరలు ఎంతన్నది అందరికి తెలిసిందే.

ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. 2008 జూన్ లో చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీగా ముడిచమురు ధర పెరిగింది. ఆ రోజు బ్యారెల్ ముడిచమురు ఏకంగా 135.36 డాలర్లు పలికింది. ఆ రోజున దేశంలో లీటరు పెట్రోల్ ధర రూ.80ను దాటేసింది. మళ్లీ లీటరు పెట్రోల్ ధర రూ.80 దగ్గరకు వచ్చేసిన ఈ రోజున అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర ఎంతో తెలుసా? అక్షరాల 58.85 డాలర్లు మాత్రమే. క్రితం రోజు ముగింపుతో పోలిస్తే 0.06 శాతం తక్కువ ధర పలికింది.

అంతర్జాతీయ ధరల ప్రకారం మన పెట్రోల్.. డీజిల్ ధరల్ని డిసైడ్ చేస్తారన్న నానుడి నిజమే అయితే.. కిందకు చూస్తున్న ముడిచమురు ధరల వేళ.. పెట్రోల్.. డీజిల్ బాదుడు ఏందన్న ప్రశ్న వేసుకుంటే.. మోడీ మాష్టారి పాలన ఎంత గొప్పదన్నది ఇట్టే అర్థమవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో అంత తక్కువ ధరకే ముడిచమురు దొరుకుతున్నా.. పాలకులు ఎందుకింత భారీ ధరల్ని పెట్టి జనాల్ని బాదేస్తున్నారు? అన్న ప్రశ్న వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

తియ్యటి మాటలు చెప్పే మోడీ మాష్టారు.. చేతల్లోకి వచ్చినప్పుడు సమస్త ధరల పెరుగుదలకు కారణమయ్యే పెట్రోల్.. డీజిల్ ధరల్ని ఎందుకు తగ్గించరు? దాని వెనుక అసలు కారణమేంది? చరిత్రలోనే గరిష్ఠంగా బ్యారెల్ ముడిచమురు 135 డాలర్లు పలికినప్పుడు పెట్రోల్.. డీజిల్ ధరలు ఎంత ఉన్నాయో.. 59 డాలర్ల ధర ఉన్నప్పుడు ఉండటం ఏమిటి? అన్న ప్రశ్న వేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. మోడీ మీద ఉన్న ప్రేమ ఆ పని చేయలేమంటే ఎవరిష్టం వారిది. ప్రజలకు మోడీ మీద ఇష్టం.. అదే ప్రజల మీద మోడీకి ఉండి ఉంటే.. నిత్యవసర వస్తువైన పెట్రోల్.. డీజిల్ ధరలు ఇలా పెరిగేవంటారా?