Begin typing your search above and press return to search.

కొత్త సంవ‌త్స‌రంలోనూ అదే పీనాసిత‌నం!

By:  Tupaki Desk   |   1 Jan 2016 6:20 AM GMT
కొత్త సంవ‌త్స‌రంలోనూ అదే పీనాసిత‌నం!
X
పండగపూట కూడా పాత మొగుడే అన్న సామెత గుర్తుకు రాక మానదు మోడీ సర్కారు తీరు చూస్తే. ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా పన్ను వాతలతో ముక్కుపిండి వసూలు చేసేలా వ్యవహరించే కేంద్ర సర్కారు.. తాను ఇవ్వాల్సిన వాటి గురించి ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇన్ కమింగ్ మాత్రమే కానీ అవుట్ గోయింగ్ అన్నది లేనట్లుగా వ్యవహరించే మోడీ సర్కారు.. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు రికార్డు స్థాయిలో పతనమవుతున్నా.. దాని ఫలాల్ని ప్రజలకు అందించేందుకు మాత్రం ససేమిరా అనటం కనిపిస్తోంది.

ఏళ్లకు ఏళ్ల కనిష్ఠానికి క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయాయి. మరి.. అంతగా ధరలు పడిపోతే.. దాని ప్రభావం పెట్రోల్.. డీజిల్ మీద కూడా ప్రభావం చూపుతుంది కదా? క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన వెంటనే.. లీటరకు రూ.1 నుంచి రూ.5 వరకూ మొహమాటం లేకుండా పెంచేసే సర్కారు.. భారీగా ధరలు క్షీణించినా మాత్రం ప్రజల మీద ధరాభారాన్ని తగ్గించే విషయంలో కనికరం చూపించని పరిస్థితి.

ప్రతి నెలా 15.. 30 (లేదంటే 31) తేదీల్లో అంతర్జాతీయ పరిస్థితులకు తగ్గట్లుగా పెట్రోల్.. డీజిల్ ధరల్ని సవరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. తాజాగా కొత్త సంవత్సరం వేళ.. డిసెంబరు 31న పెట్రోల్.. డీజిల్ ధరల మీద సమీక్ష నిర్వహించారు. అంతులేని పీనాసితనాన్ని ప్రదర్శించే మోడీ సర్కారు తీరుకు తగ్గట్లే.. తాజాగా పెట్రోల్ మీద లీటరకు 66 పైసలు.. డీజిల్ మీద లీటరకు 1.06రూపాయిల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ధరలు భారీగా పతనమైనా.. ధరల్ని తగ్గించే విషయలో విపరీతమైన పీనాసితనాన్ని ప్రదర్శించే తీరును కొత్త సంవత్సరం వేళ కూడా మార్చుకోకపోవటం గమనార్హం. ప్రజల పన్నుల మీద బతికే ప్రభుత్వాలు.. ప్రజల గురించి పట్టించుకోవాలన్న ఆలోచన ఉంటుందా..?