Begin typing your search above and press return to search.

పెట్రోల్.. డీజిల్ మీద మోడీ సర్కారు బాదుడు షురూ..తొలిరోజు ఎంతంటే?

By:  Tupaki Desk   |   22 March 2022 5:31 AM GMT
పెట్రోల్.. డీజిల్ మీద మోడీ సర్కారు బాదుడు షురూ..తొలిరోజు ఎంతంటే?
X
దాదాపు ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం మీద ఎవరినైనా ఏదైనా ఫిర్యాదు చేయమన్నంతనే అందరికి గుర్తుకు వచ్చేది పెట్రోల్.. డీజిల్ ధరల పెంపే. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత లీటరు పెట్రోల్ ధరను సెంచరీ సాధించిన ఘనత మోడీ సర్కారుకే సొంతమని చెప్పాలి. లీటర్ డీజిల్ ధర సైతం సెంచరీకి దగ్గరకు వచ్చేయటం తెలిసిందే. నిజానికి లీటరు పెట్రోల్ ధర సెంచరీని దాటేయటమే కాదు.. రికార్డు స్థాయిలో పరుగులు తీస్తున్న వేళ.. దేశ వ్యాప్తంగా ఈ పెంపుపై హాహాకారాలు వ్యక్తమయ్యాయి.

అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర స్థిరంగా ఉండటం.. కొన్ని సందర్భాల్లో తక్కువ ధరకు లభిస్తున్నా.. దేశీయంగా మాత్రం పెట్రోల్.. డీజిల్ ధరల్ని భారీగా పెంచేస్తున్న వైనంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో.. నిరసనల తీవ్రతను గుర్తించిన మోడీ సర్కారు ఆ మధ్యన లీటరు పెట్రోల్.. డీజిల్ మీద భారీ ఎత్తున తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల సామాన్యులకు కాస్తంత ఉపశమనం కలిగించినా.. పెరిగిన ధరాభారంతో వచ్చే ఇబ్బందులు మాత్రం తగ్గలేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల పుణ్యమా అని గడిచిన ఐదు నెలలుగా పెట్రోల్.. డీజిల్ ధరలు పెరగలేదు.

ఉక్రెయిన్ మీద రష్యా చేస్తున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగి.. రికార్డు స్థాయిలకు చేరుకున్న వేళలోనూ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రోజురోజుకి అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ముడిచమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్..

డీజిల్ ధరల్ని పెంచకపోవటంతో లోటు పెద్ద ఎత్తున పెరుగుతోంది. ముడిచమురు ధరలు కనిష్ఠంగా ఉన్న వేళలోనే భారీగా వేసిన బాదుడుతో ఆదాయాన్ని చూసిన కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలకు పెరిగిన ముడి చమురు ధరల నేపథ్యంలో పాత ధరల్నే కొనసాగించటం కష్టంగా మారింది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసినంతనే ధరల్ని పెంచుతారన్న ప్రచారాన్ని తప్పు చేసిన మోడీ సర్కారు.. ఫలితాలు వెల్లడైన రెండు వారాల పాటు ధరల్ని పెంచకుండా పాతవాటినే కొనసాగిస్తూ ఉగ్గబెట్టుకొచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ధరలు పెంచకుంటే ఇబ్బందులు తప్పవన్న విషయాన్ని గుర్తించిన మోడీ సర్కారు తాజాగా ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటరు పెట్రోల్ మీద 90 పైసలు.. లీటరు డీజిల్ మీద 87 పైసలు పెంచారు.

ఇప్పుడు మొదలైన ధరల పెంపుదల రానున్న రోజుల్లో అంతకంతకూ పెరగటం ఖాయమంటున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు.. పెరిగే పెట్రోల్ డీజిల్ ధరలు మరిన్ని ఇబ్బందుల్ని తీసుకురావటం ఖాయమంటున్నారు.