Begin typing your search above and press return to search.

శుభవార్తలే అన్న తొలిరోజే బాదేశారు

By:  Tupaki Desk   |   2 Jan 2017 4:21 AM GMT
శుభవార్తలే అన్న తొలిరోజే బాదేశారు
X
కొత్త ఏడాది.. తొలి రోజునే దేశ ప్రజల మీద బాదుడు కార్యక్రమం షురూ అయ్యింది. జాతిని ఉద్దేశించి దేశ ప్రధాని దాదాపు ముప్పావుగంట పాటు స్పీచ్ ఇచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రజల నెత్తిన భారం మోపేలా పెట్రో ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నారు.ప్రతి నెలలో 15వ తేదీన.. నెల చివర్లో అంతర్జాతీయంగా ఉన్న ఆయిల్ ధరల ప్రాతిపదికగా.. పెంచటం.. తగ్గించటం లాంటివి చేస్తుండటం కామనే.

పెద్ద నోట్ల రద్దు.. అవినీతిపరులకు సినిమా.. నిజాయితీపరులకు అన్నీ అచ్చేదిన్ లే అన్నట్లుగా మాట్లాడిన మోడీ.. మాటలకు మాటలే.. చేతలకు చేతలే అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసింది. వాస్తవానికి నెలాఖరు రోజున సమీక్ష జరిపి.. నెల మొదటి రోజున అమలు అయ్యేలా నిర్ణయం తీసుకోవాల్సిన ఉన్నా.. కొత్త సంవత్సరం వేడుకల జోష్ ను ఖరాబు చేయటం ఎందుకని అనుకున్నారో కానీ.. శనివారం సాయంత్రం వెలువడాల్సిన ఈ బాదుడు నిర్ణయం.. ఆదివారం సాయంత్రం వేళ ప్రకటన జారీ అయ్యింది.

డిసెంబరు మలి వారంలో పెట్రో వాత పెట్టిన మోడీ సర్కారు.. తాజాగా మరోసారి పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. లీటరు పెట్రోల్ ధర రూ.1.29.. లీటరు డీజిల్ 97 పైసలు చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలు ఆదివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నట్లుగా వెల్లడించారు.

గడిచిన నెల వ్యవధిలో పెట్రోల్ ధరల్ని వరుసగా పెంచడటం ఇది మూడోసారి కాగా.. డీజిల్ ధరల్ని రెండోసారి పెంచినట్లైంది. తాజా పరిణామాల నేపథ్యంలో వంట గ్యాస్ బండల ధరలు సైతం స్వల్పంగా పెరగనున్నాయని చెప్పక తప్పుదు. కొసమెరుపు ఏమిటంటే.. తమ పాలనలో అన్నీ మంచి రోజులే అని చెప్పే మోడీ సర్కారు.. గడిచిన ఆరు నెలల వ్యవధిలో సబ్సిడీ వంట గ్యాస్ బండ ధరను ఎనిమిదో సారి పెంచుతూ నిర్ణయం తీసుకోవటం. అన్నీ మంచిరోజులంటే.. వరుసగా పన్నుపోటు వేసేయటమేనా..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/