Begin typing your search above and press return to search.

లీటరు పెట్రోల్ ఆ దేశంలో అక్షరాల రూ.2 మాత్రమే

By:  Tupaki Desk   |   18 March 2022 11:30 PM GMT
లీటరు పెట్రోల్ ఆ దేశంలో అక్షరాల రూ.2 మాత్రమే
X
పెట్రోల్.. డీజిల్ మంటలు ప్రపంచంలోని పలు దేశాల్ని మంటపుట్టిస్తున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న పెట్రోల్.. డీజిల్ ధరల పుణ్యమా అని సామాన్యుడితో పాటు.. మధ్యతరగతి జీవుల బడ్జెట్ సైతం మారిపోతున్నాయి. ఇటీవల మొదలైన ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు ప్రపంచ వ్యాప్తంగా గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దీంతో.. పలు దేశాల్లో పెట్రోల్.. డీజిల్ ధరలు మంట పుట్టిస్తున్నాయి.

వాస్తవానికి ముడిచమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ మన దేశంలో మాత్రం ఇప్పటికి ఆ ప్రభావం పడలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ధరల్ని పెంచకుండా ఉన్న మోడీ సర్కారు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ధరల్ని పెంచేస్తారన్న వాదన వినిపించింది. కానీ..అందులో నిజం లేదన్నట్లుగా మోడీ సర్కారు వ్యవహరిస్తోంది. గతంలో మాదిరి పెట్రోల్.. డీజిల్ ధరల పెంపుపై దూకుడుగా వ్యవహరించకపోవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పెట్రోల్.. డీజిల్ ధరలు పెంచటం కారణంగా కేంద్ర సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయాన్ని మోడీ అండ్ కో తాజాగా గుర్తించారని.. అందుకే ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవటం లేదంటున్నారు. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్నయుద్ధం నేపథ్యంలో పలు దేశాల్లో పెట్రోల్.. డీజిల్ ధరలు పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని దేశాల్లో లీటరు పెట్రోల్ ధరలు కారుచౌకగా ఉన్నాయి.ఆ ధరలు వింటే అస్సలు నమ్మబుద్ధి కాదు.

ప్రస్తుతం మన దేశంలో లీటరు పెట్రోలు రూ.108 - రూ.115 మధ్యలో ఉంది. మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లోని పెట్రోల్ ధరల్ని మన రూపాయి విలువతో చూసినప్పుడు పాకిస్థాన్ లో రూ.63.43 ఉంటే.. బంగ్లాదేశ్ లో రూ.78.43.. నేపాల్ లో రూ.93 ఉంది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ ధర పలుకుతున్న దేశం హాంగ్ కాంగ్ గా చెప్పాలి.

ఈ దేశంలో లీటరు పెట్రోల్ రూ.218గా ఉంది. ఇక.. అత్యంత చౌకగా పెట్రోల్ అమ్మే దేశం ఏమైనా ఉందంటే అది.. వెనిజులా. అక్కడ లీటరు పెట్రోల్ కేవలం రూ.1.89 మాత్రమే. ఆ తర్వాత లిబియాలోనే లీటరు పెట్రోల్ రూ.2.43 మాత్రమే. మన ధరలతో పోల్చినప్పుడు లీటరు పెట్రోల్ రూ.2 మాత్రమే అన్న మాటను జీర్ణించుకోవటం కష్టమే కదూ?