Begin typing your search above and press return to search.

లీట‌ర్ పెట్రోల్ రూ.30కి వ‌చ్చే రోజు ఉంద‌ట‌

By:  Tupaki Desk   |   26 May 2017 5:19 AM GMT
లీట‌ర్ పెట్రోల్ రూ.30కి వ‌చ్చే రోజు ఉంద‌ట‌
X
ఈ మాట వింటే.. మతి ఉండే మాట్లాడుతున్నారా? క‌ల‌లు మ‌రీ ఎక్కువైపోతున్నాయే.. వంటి కౌంట‌ర్లు ప‌డ‌తాయి. కానీ.. విష‌యం మొత్తం తెలిస్తే న‌మ్మ‌క త‌ప్ప‌దు. రోజురోజుకూ.. అంత‌కంత‌కూ ధ‌ర‌లు పెర‌గ‌ట‌మే కానీ త‌గ్గ‌టం లేని పెట్రోల్..డీజిల్ ధ‌ర‌లు కారుచౌక‌కు ఎలా వ‌స్తాయ‌న్న సందేహం క‌ల‌గ‌టం ఖాయం. అయితే.. ఇలాంటి సందేహాల‌కు లాజిక్కు చెప్పి మ‌రీ.. నిజ‌మే కావొచ్చు సుమా అని అనిపిస్తున్నారు ప్ర‌ఖ్యాత ఫ్యూచ‌రిస్టు టోనీ సెబా.

సంప్ర‌దాయ విద్యుత్ తో పోలిస్తే.. సోలార్ ఎన‌ర్జీ ప‌ది రెట్లు ఎక్కువ‌గా ఉన్న స‌మ‌యంలోనే.. ఫ్యూచ‌ర్ అంతా సోలార్ ఎన‌ర్జీ అన్న మాట‌ను ఢంకా బ‌జాయించి చెప్పిన ఆయ‌న మాట‌లు ఇప్పుడు ఎంత‌లా నిజం అవుతున్నాయో తెలిసిందే. ఇక‌.. పెట్రోల్ ధ‌ర‌ల భారీ ప‌త‌నం మీద ఆయ‌న చెప్పే అంచ‌నా ఏమిటంటే..పెరుగుతున్న సాంకేతిక‌త పుణ్యమా అని ప్ర‌పంచ వ్యాప్తంగా పెట్రోల్‌.. డీజిల్ మీద ఆధార‌ప‌డ‌టం త‌గ్గిపోతుంద‌ని.. ప్ర‌స్తుతానికి చ‌మురుతో న‌డిచే వాహ‌నాలు ఉన్న‌ప్ప‌ట‌కీ రానున్న రోజుల్లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగం భారీగా పెర‌గుతుంద‌ని.. ఫ‌లితంగా ముడిచ‌మురు డిమాండ్ భారీగా త‌గ్గి బ్యారెల్ పాతిక డాల‌ర్ల కంటే దిగువ‌కు ప‌డిపోవ‌టం ఖాయ‌మంటున్నారు.

2020-21 నాటికి చ‌మురు డిమాండ్ వంద మిలియ‌న్ బ్యారెళ్ల‌కు.. త‌ర్వాతి ఐదేళ్ల‌కు 70 మిలియ‌న్ బ్యారెళ్ల‌కు ప‌డిపోతుంద‌ని.. అదే స‌మ‌యంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు త‌క్కువ ధ‌ర‌కు దొరుకుతాయ‌ని.. వాటి నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు త‌క్కువ‌గా ఉండ‌టంతో అంద‌రూ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల్ని వినియోగిస్తుంటార‌ని విశ్లేషించారు. పెరిగే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగం.. చ‌మురు ప‌రిశ్ర‌మ‌ను భారీగా దెబ్బ తీస్తుంద‌ని పేర్కొన్నారు. చ‌మురు రంగం దెబ్బ తిన‌టం స‌రే.. మ‌రి.. చ‌మురు మీద ఆధార‌ప‌డి బ‌తికే సంప‌న్న దేశాల సంగ‌తి ఎలా మారుతుందో? సెబా అంచ‌నా నిజ‌మైతే.. ఇప్ప‌టివ‌ర‌కూ ద‌ర్జాగా ఉన్న చ‌మురు దేశాలు రానున్న రోజుల్లో సంక్షోభంలోకి కూరుకుపోతాయేమో? అదే జ‌రిగితే.. ఇప్ప‌టి సంప‌న్న చ‌మురు దేశాలు రానున్న కాలంలో పేద దేశాలుగా మారిపోతాయేమో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/