Begin typing your search above and press return to search.

తగ్గింది 31 పైసలే అయినా ఏపీలో తగ్గేది రూ.2.31

By:  Tupaki Desk   |   1 July 2015 10:37 AM IST
తగ్గింది 31 పైసలే అయినా ఏపీలో తగ్గేది రూ.2.31
X
ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. విదేశీ మార్కెట్లకు అనుగుణంగా ధర తగ్గించటం కానీ పెంచటం కానీ చేస్తుంటారు. దీంతో ప్రతి నెల 15న.. నెల చివరి రోజున సమీక్ష జరిపి పెట్రోల్‌.. డీజిల్‌ధరల్ని నిర్ణయించటం తెలిసిందే.

తాజాగా పెట్రోల్‌.. డీజిల్‌ ధరల్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పెట్రోల్‌ లీటరుపై 31పైసలు.. డీజిల్‌ లీటరుపై 71 పైసలు తగ్గే వీలుంది. అయితే.. ఈ తగ్గింపు పెద్ద ప్రభావం చూపేది కాకున్నా.. ఏపీ సర్కారు మాత్రం కాస్తంత తీపి కబురును రాష్ట్ర ప్రజలకు అందించింది.ఆ మధ్య పెట్రోల్‌.. డీజిల్‌ ధరలు భారీగా తగ్గిన సమయంలో.. ఆదాయం తగ్గిపోవటంతో అదనపు వ్యాట్‌ను విధించటం తెలిసిందే.

ఈ వ్యాట్‌ లీటరుకు రూ.4 చొప్పున బాదేశారు. దీనిపై లారీ యజమానులు.. పెట్రోల్‌ బంకుల యజమానుల నుంచి.. ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఈ పెంపు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో గతంలో విధించిన అదనపు వ్యాట్‌లో రూ.2 మేర తగ్గించాలని నిర్ణయించారు.

దీంతో.. కేంద్రం తగ్గింపు 31 పైసలుతో కలిపితే.. లీటరుకు రూ.2.31 చొప్పున పెట్రోల్‌కు.. రూ.2.61 చొప్పున లీటర్‌ డీజిల్‌కు ధర తగ్గనుంది. దీనికి సంబంధించిన అధికారిక నిర్ణయాన్ని మంత్రివర్గ ఉప సంఘం తీసుకుంది. మరి.. ఏపీ నిర్ణయానికి ధీటుగా తెలంగాణ రాష్ట్ర సర్కారు కూడా ధరలు తగ్గిస్తుందా? అన్నది చూడాలి.