Begin typing your search above and press return to search.

లీట‌రు పెట్రోల్ రూ.80కు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేసింది

By:  Tupaki Desk   |   21 April 2018 5:12 AM GMT
లీట‌రు పెట్రోల్ రూ.80కు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేసింది
X
నాలుగున్న‌రేళ్ల క్రితం సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న వేళ‌.. రాష్ట్రాల‌కు అతీతంగా దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల్లో అత్య‌ధికులు మోడీ ప్ర‌ధాని కావాల‌ని కోరుకున్నారు. వారు అలా అనుకోవ‌టానికి కార‌ణాల్లో ముఖ్య‌మైంది.. కీల‌క‌మైంది ఏమంటే.. మోడీ ప్ర‌ధాని అయితే పెట్రోల్‌.. డీజిల్ రేట్లు భారీగా ప‌డిపోతాయ‌ని. మోడీ ప్ర‌ధాని అయితే విదేశాల్లో దాచిన న‌ల్ల‌ధ‌నం భార‌త్ కు వ‌చ్చినా రాకున్నా.. నిత్యం వాడే పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు మాత్రం నేల‌కు వ‌చ్చేస్తాయ‌ని.. సామాన్యుడి బ‌డ్జెట్ మ‌రింత హాయిగా ఉంటుంద‌ని క‌ల‌లు క‌న్నారు.

ఇప్పుడా క‌ల‌లు క‌ల్ల‌లు కావ‌ట‌మే కాదు.. ద‌డ పుట్టించే ప‌రిస్థితికి చేరుకుంది. అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉన్న వేళ‌.. ధ‌ర‌లు త‌గ్గించేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌ని మోడీ స‌ర్కారు. ఆ మాట‌.. ఈ మాట చెప్పి అద‌న‌పు ప‌న్నులు బాదేసి మ‌రీ.. ముక్కు పిండి వ‌సూలు చేశారు. ఇప్పుడేమో అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు పెరిగిన నేప‌థ్యంలో త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో బాదేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర‌లు పెరిగిన వేళ‌.. దేశ ప్ర‌జ‌ల‌కు షాకిచ్చేలా మోడీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇంత‌కు ముందు ఎప్పుడూ లేని రీతిలో పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు సామాన్యుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తేలా చేస్తున్నాయి. ప్ర‌తి రోజూ ధ‌ర‌ల్ని స‌మీక్షించే విధానం మొద‌లు పెట్టిన రోజు నుంచి ధ‌రలు పెర‌గ‌ట‌మే కానీ త‌గ్గ‌ని ప‌రిస్థితి. తాజాగా అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర‌లు పెరిగిన నేప‌థ్యంలో దేశీయంగా ధ‌ర‌లు భారీగా పెరిగాయి. గ‌తంలో ఎప్పుడూ లేనంత భారీగా ధ‌ర‌లు పెర‌గ‌టం గ‌మ‌నార్హం.

తాజాగా పెరిగిన ధ‌ర‌ల‌తో హైద‌రాబాద్ లో డీజిల్ గ‌రిష్ఠానికి చేరుకొని ఆల్ టైం హైగా న‌మోదైంది. పెట్రోల్ ది కూడా అదే బాట‌లో న‌డ‌వ‌టం గ‌మ‌నార్హం. శుక్ర‌వారం నాటి ధ‌ర‌ల్నే తీసుకుంటే లీట‌రు పెట్రోల్ రూ.78.45 ఉండ‌గా.. అదే డీజిల్ ధ‌ర లీట‌రు రూ.70.96 న‌మోదైంది. తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు చూస్తే.. రానున్న నెల‌లో పెట్రోల్ లీట‌రు ధ‌ర రికార్డు స్థాయిలో రూ.80 ట‌చ్ చేయ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. తాజాగాపెరిగిన పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల నేప‌థ్యంలో ర‌వాణా ఛార్జీలు మొద‌లు అన్ని ధ‌ర‌లు పెరిగే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని చెప్ప‌క త‌ప్పదు.

డీజిల్‌.. పెట్రోల్ ధ‌ర‌లు ఏడాది వ్య‌వ‌ధిలో ఎంతగా పెరిగాయో చూస్తే.. సామాన్యుడి జేబు మీద ఎంత అద‌న‌పు భారం ప‌డుతుంద‌న్న‌ది ఇట్టే అర్థ‌మవుతంది. గ‌త ఏడాది జూన్ లో లీట‌రు డీజిల్ ధ‌ర హైద‌రాబాద్ లో రూ.59.30 ఉండ‌గా.. తాజాగా రూ.70.96కు చేరుకుంది. అదే స‌మ‌యంలో లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.69.56 ఉండ‌గా.. తాజాగా లీట‌రుకు ప‌ది రూపాయిల చొప్పున పెరిగిన ప‌రిస్థితి. భారం మ‌రింత తేలిగ్గా అర్థ‌మ‌య్యేలా చెప్పాలంటే గ‌తంలో ఆరు లీట‌ర్లు వాడితే చెల్లించే మొత్తం ఇప్పుడు ఐదు లీట‌ర్ల‌కే చెల్లించాల్సిన దుస్థితి.

ఇక్క‌డ మోడీ దోపిడీని గుర్తించాల్సిన అవ‌స‌రం సామాన్యుల‌పైన ఉంది. యూపీఏ హ‌యాంలో బ్యారెల్ ముడిచ‌మురు ధ‌ర 110 డాల‌ర్లు దాటిన వేళ‌లో కూడా ఇప్పుడున్న ధ‌ర‌లు లేవు. మ‌రిప్పుడు అంత‌ర్జాతీయంగా భారీగా ధ‌ర‌లు పెరిగిన‌ట్లుగా చెబుతున్న ముడిచ‌మురు బ్యారెల్ ధ‌ర ఎంతో తెలుసా? 73.79 డాల‌ర్లు మాత్ర‌మే. ఈ లెక్క‌న యూపీఏ హ‌యాంలో మాదిరి బ్యారెల్ ధ‌ర 110 డాల‌ర్లు దాటితే మ‌న చెల్లించే డీజిల్‌.. పెట్రోల్ ధ‌ర ఇంకెంత ఉంటుందో ఆలోచిస్తే గుండె గుభేల్ మ‌న‌టం ఖాయం. ఏదో చేస్తాడ‌ని న‌మ్మి ఓటేసిన మోడీ.. దేశ ప్ర‌జ‌ల్ని ఎంత‌గా బాదుతున్నారో పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.