Begin typing your search above and press return to search.

పెట్రోల్.. డీజిల్ ను జీఎస్టీలోకి తీసుకురానున్నారా?

By:  Tupaki Desk   |   15 Sep 2021 6:40 AM GMT
పెట్రోల్.. డీజిల్ ను జీఎస్టీలోకి తీసుకురానున్నారా?
X
మొదటిసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వేళ మోడీ సర్కారు ప్రయాణం నల్లేరు మీద నడకలా సాగింది. రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నుంచి సమస్యల మీద సమస్యలు మీద పడుతున్న పరిస్థితి. కరోనా మొదటి వేవ్ ను తట్టుకోవటమే కాదు.. భారీ ఇమేజ్ ను సొంతం చేసుకున్న మోడీ సర్కారుకు.. రెండో వేవ్ సందర్భంగా ఉన్నదంతా ఊడ్చుకుపోయిన పరిస్థితి. సెకండ్ వేవ్ ను సమర్థంగా అడ్డుకోవటంలోనూ.. దాని కారణంగా చోటు చేసుకున్న విపరిణామాల్ని అడ్డుకట్ట వేయటంలో కేంద్రం ఘోరంగా ఫెయిల్ అయ్యిందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఆ మాటకు వస్తే మోడీ సర్కారు ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసిందని చెప్పక తప్పదు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. పెట్రోల్.. డీజిల్ ధరలు కూడా మోడీ సర్కారును బద్నాం చేస్తున్నాయి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో కీలకమైన పెట్రోల్.. డీజిల్ పై అంతకంతకూ పెంచుకుంటూ పోతున్న మూలధర కారణంగా ఈ రోజున పెట్రోల్ లీటరు రూ.105 వరకు ఉంటే.. డీజిల్ రూ.96.69గా ఉంటోంది. ఈ ధరలు హైదరాబాద్ లోనివి. అదే ఏపీలో అయితే.. లీటరకు మరో మూడు.. నాలుగు రూపాయిలు అదనంగా ఉన్న సంగతి తెలిసిందే. నిత్యవసర వస్తువైన పెట్రోల్.. డీజిల్ ధరలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మార్పులు చెందుతున్నట్లు చెప్పినా.. ఆచరణలో మాత్రం.. పెంచటమే తప్పించి.. తగ్గించటం అన్న ఆలోచన కేంద్రానికి లేదన్న మాట వినిపిస్తోంది.

అటు కేంద్రమే కాదు.. ఇటు రాష్ట్రాలు కూడా వీటిపై వచ్చే పన్ను ఆదాయంపై తీవ్రంగా ఆధారపడుతుండటం సామాన్యులకు పెద్ద సమస్యగా మారింది. పైకి మాటలే కానీ.. అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ పన్నుల్ని తగ్గించే విషయంలో సానుకూలంగా లేదు. ఇక.. తాజాగా పెట్రోల్.. డీజిల్ ధరలు ఇంతలా పెరగటానికి కారణం.. పన్ను రేటు కంటే కూడా.. ఎప్పటికప్పుడు వీటి మూల ధరను పెంచుకుంటూ పోవటమే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అంతకంతకూ పెరిగిన పెట్రోల్.. డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు మహా ఇబ్బందిగా మారింది. ప్రభుత్వంపై సామాన్యుల్లోనూ వ్యతిరేకత అంతకంతకూ ఎక్కువైంది. గతంలో మోడీ ప్రభుత్వానికి దన్నుగా ఉన్న వారు.. బలంగా వాదనలు వినిపించిన వారు సైతం పెట్రోల్.. డీజిల్ ధరల విషయంలో మాత్రం ప్రభుత్వం తీరును తప్ప పట్టే పరిస్థితి. ఈ సెగ కేంద్రానికి తాకినట్లుగా చెబుతున్నారు. ఒకే దేశం.. ఒకే పన్నుల విధానం పేరుతో తీసుకొచ్చిన జీఎస్టీలోకి మద్యం.. పెట్రోల్.. డీజిల్.. విమాన ఇంధనం లాంటి కొన్నింటిని జాబితాలో చేర్చలేదు. అయితే.. పన్ను ఎక్కువగా ఉండే లిక్కర్.. పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ జాబితాలోకి తీసుకురావాలన్న డిమాండ్ ఉంది. అయితే.. దీనిపై ప్రభుత్వాలు ఆసక్తి చూపించలేదు. జీఎస్టీలోకి చేరిస్తే.. పన్ను ఆదాయం భారీగా తగ్గిపోవటమే దీనికి కారణం. జీఎస్టీలో గరిష్ఠంగా 28 శాతం మాత్రమే పన్ను విధించే వీలుంది. ఒకవేళ.. దీన్ని తీసుకొస్తే.. రాష్ట్రాలతో పాటు.. కేంద్రం కూడా భారీగా పన్ను ఆదాయాన్ని కోల్పోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాల్ని నడిపిస్తోంది లిక్కర్.. పెట్రోల్.. డీజిల్ మీద పన్ను ఆదాయమే.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్ పై రూ.32.80, డీజిల్ మీద రూ.31.80 ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తోంది. దీనికి అదనంగా రాష్ట్రాలు సైతం పన్ను వసూళ్లను చేపడుతున్నాయి. ఒకవేళ.. వీటిని జీఎస్టీలోకి తీసుకెళితే.. పన్ను 28 శాతానికి మించి వేసే అవకాశం ఉండదు. రాష్ట్రాలు కూడా అదనంగా పన్ను విధింపులకు అవకాశం ఉండదు. అదే జరిగితే.. పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా తగ్గటం ఖాయం. మరి.. కీలకమైన పన్ను ఆదాయాన్ని కోల్పోయి మరీ ధరలు తగ్గేలా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా? అన్నదిప్పుడు ప్రశ్న. ఈ నెల 17న జరిగే జీఎస్టీ మండలి భేటీలో కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తారన్న మాట వినిపిస్తున్న వేళ.. మరేం జరుగుతుందో చూడాలి.