Begin typing your search above and press return to search.

ఫైజర్ టీకా మూడు డోసులతో ఐదేళ్ల పిల్లలకు రక్షణ

By:  Tupaki Desk   |   24 May 2022 1:30 PM GMT
ఫైజర్ టీకా మూడు డోసులతో ఐదేళ్ల పిల్లలకు రక్షణ
X
ప్రపంచాన్ని గడగడలాడించి.. ప్రజల జీవన గతినే మార్చిన కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలంటే టీకా వేసుకోవడం తప్పనిసరి అని ఇప్పటికే చాలా మంది వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ టీకా ఐదేళ్లు పైబడిన వారికే అందుబాటులోకి వచ్చింది. మరి ఐదేళ్ల లోపు ఉన్న పిల్లలకు కరోనా సోకితే ఎలా..? వారిని ఆ మహమ్మారి నుండి రక్షించేదెలా..? దీనికి సమాధానం చెప్పింది ప్రముఖ టీకా కంపెనీ ఫైజర్.

ఐదేళ్ల లోపు పిల్లకు ఫైజర్ టీకా మూడు డోసులు వేస్తే కరోనా నుంచి రక్షణ కల్పిస్తుందని ఆ కంపెనీ ప్రకటించింది. పసిపిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకు వచ్చే ప్రయత్నంలో ఈ డేటాను అమెరికా ఔషధ నియంత్రణ మండలి(ఎఫ్‌డీఏ)కు వచ్చే వారం సమర్పించడానికి రంగం సిద్ధం చేస్తోంది.

రోజుకో కొత్త వేరియంట్‌ రూపంలో కరోనా రూపు మార్చుకుని దండయాత్ర చేస్తున్న తరుణంలో పసిపిల్లలను ఈ మహమ్మారి నుంచి ఎలా రక్షించుకోవాలో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఫైబర్ ప్రకటన వారిలో కాస్త ఆనందాన్ని నింపింది. కోవిడ్ సోకినా తమ పిల్లలకు ఏం కాదన్న కొండంత భరోసానిచ్చింది. కరోనా కేసులు మరోసారి ఉద్ధృతంగా వ్యాపిస్తున్న వేళ ఫైజర్-బయోఎన్‌టెక్ కొవిడ్-19 బూస్టర్ వ్యాక్సిన్‌ని అందజేస్తున్నారు.

ఐదేళ్ల లోపు పిల్లలకు ఫైజర్ కోవిడ్-19 వ్యాక్సిన్ మూడు డోసులు వేస్తే బలమైన రక్షణ ఉంటుందని ఫైజర్ కంపెనీ ప్రకటించింది. అమెరికాలో ఐదేళ్లలోపు ఉన్న 18 మిలియన్ల పిల్లలు మాత్రమే కరోనా వ్యాక్సినేషన్‌కు అనుమతిపొందలేదని.. వచ్చే నెలలో తమ పిల్లలకు కూడా కోవిడ్ టీకా వేయించాలని చూస్తున్న తల్లిదండ్రులకు తమ వ్యాక్సిన్ శ్రేయస్కరమైనదని వెల్లడించింది.

పెద్దలు తీసుకునే డోసులో పదోవంతు డోసైనా పసిపిల్లలకు అందివ్వాలని ఫైజర్ యోచిస్తోంది. కానీ ఐదేళ్లలోపు పిల్లలకు రెండు డోసులు రక్షణ కల్పించలేవని ట్రయల్స్‌లో తేలింది. అందువల్ల పరిశోధకులు గత శీతాకాలంలో ఒమిక్రాన్ కోరలు చాచిన సమయంలో 6 నెలల నుంచి నాలుగేళ్ల వయసున్న పిల్లలు 1600 మందికి మూడో డోసు కూడా అందించారు.

ఐదేళ్లలోపు పిల్లలకు ఫైజర్ టీకా మూడు డోసులు వేస్తే కరోనా మహమ్మారిని గట్టిగా ప్రతిఘటించే యాంటీబాడీలు వారిలో పెరిగాయని ఈ పరిశోధనలో తేలిందని ఫైజర్-బయోఎన్‌టెక్ వెల్లడించాయి. ఎఫ్‌డీఏ ప్రమాణాల మేరకు అత్యవసర వినియోగానికి ఎలాంటి భద్రతా సమస్యలు లేకుండా ఫైజర్ టీకా మూడు డోసులు ఉపయోగపడతాయని తెలిపాయి.