Begin typing your search above and press return to search.

స్టేజ్ మీదే అధ్య‌క్షుడి లిప్‌ కిస్‌..కొత్త ర‌చ్చ‌

By:  Tupaki Desk   |   4 Jun 2018 12:18 PM GMT
స్టేజ్ మీదే అధ్య‌క్షుడి లిప్‌ కిస్‌..కొత్త ర‌చ్చ‌
X
డ్రగ్ మాఫియాపై భీకర దాడులు చేసి చండశాసనుడిగా ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టి మారిన సంగ‌తి తెలిసిందే. 2016లో పిలిప్పీన్స్ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డ్యుటెర్టి డ్రగ్ మాఫియాపై యుద్ధం ప్రకటించారు. కేవలం 16 నెలల్లోనే ఆ దేశంలో సుమారు నాలుగు వేల మందిని పోలీసులు చంపేశారు. డ్రగ్ సంబంధిత నేరాల్లోనే వాళ్లను హతమార్చారు. తన నిర్ణ‌యాల‌ను స‌మ‌ర్థించుకున్న‌ప్ప‌టికీ ఆయ‌న తీరు కొంత వివాదాస్ప‌దం అయింది. అలాంటి డ్యుటెర్టి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పుడు ఓ మహిళకు స్టేజ్ మీద లిప్ కిస్ ఇచ్చి విమర్శలకు గురవుతున్నారు.

ఇటీవల దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ కు వెళ్లిన డ్యుటెర్టి. అక్కడ ఫిలిప్పీన్స్ సంతతి ప్రజలతో సమావేశం నిర్వహించారు. సభకు అనేక మంది హాజరయ్యారు. అయితే స్టేజ్‌ పై మాట్లాడుతూ అధ్యక్షుడు డ్యుటెర్టి ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ పుస్తకాన్ని అందజేసేందుకు ఇద్దరు మహిళల్ని స్టేజ్ మీదకు రమ్మన్నారు. ఫిలిప్పీన్స్‌ కు చెందిన ఆ మహిళలు ఇద్దరూ స్టేజ్ మీద‌కు వచ్చారు. మొదటగా తన దగ్గర ఉన్న పుస్తకాన్ని అందజేసిన డ్యుటెర్టి.. ఒక మహిళను హగ్ చేసుకుని ఆమె చెంపపై ఓ కిస్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత మరో మహిళను తనకు లిప్ కిస్ ఇవ్వాలని కోరారు. అధ్యక్షుడు లిప్ కిస్ అడుగుతుంటే.. ఆ మహిళ స్టేజ్‌ పై మొహమాటానికి లోనైంది. ఇవ్వాలా వద్దా అన్న సందిగ్ధంలో పడింది. కానీ డ్యుటెర్టి మాత్రం పదేపదే తన చూపుడు వేలితో పెదవులను చూపిస్తూ.. లిప్ కిప్ ఇవ్వాలని వేడుకున్నారు. చివరకు ఆమెను దగ్గర తీసుకుని.. ఆమె పెదవులపై ముద్దు పెట్టారు. ఆ ఘటన జరిగిప్పుడు అక్కడ సభలో ఉన్న వారంత కేరింతలు కొట్టారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అధ్యక్షుడి తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నది. డ్యుటెర్టి ప్రవర్తన.. మహిళల పట్ల సరిగా లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి.