Begin typing your search above and press return to search.

అమ్మ చనిపోయిన వేళ అతగాడేం చేశాడంటే..

By:  Tupaki Desk   |   23 Dec 2016 4:48 AM GMT
అమ్మ చనిపోయిన వేళ అతగాడేం చేశాడంటే..
X
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి.. అమ్మగా అందరి మనసుల్ని దోచిన జయలలిత మరణించిన రోజున తమిళనాడు మాత్రమే కాదు.. ఆమె గురించి అవగాహన ఉన్న వారంతా శోకసంద్రంలో కూరుకుపోయారు. ఇలాంటి వేళ.. అమ్మ అనుగ్రహంతో అందలం ఎక్కటమే కాదు.. అత్యున్నత స్థానంలో నిలిచిన వ్యక్తి చేసిన పని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. అదే ఇప్పుడాయనకు శాపంగా మారిన పరిస్థితి.

తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థానానికి తనకంటే పదిహేడు మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు బరిలో ఉన్నప్పటికీ.. అమ్మకున్న స్పెషల్ ఇంట్రస్ట్ కారణంగా అందరిని తోసి రాజని మరీ.. రామ్మోహన్ రావుకు తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాను కట్టబెట్టారు. ఇలాంటి వ్యక్తి.. అమ్మ మరణించిన రోజు ఏం చేశారో తెలిస్తేముక్కున వేలేసుకోవాల్సిందే.

అమ్మ ఇక లేరన్న వార్త తెలిసిన నాటి నుంచి తీవ్రమైన భావోద్వేగంతో తమిళులు ఊగిపోతున్న వేళ.. ఇలాంటి భావోద్వేగాలకు దూరంగా రామ్మోహన్ రావు.. కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డితో మాట్లాడిన సుదీర్ఘ ఫోన్ కాల్ వివరాలు బయటకు వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయి. తాము కొత్తగా మార్చిన కరెన్సీని ఎలా దాచి పెట్టాలన్న అంశంపై వారిద్దరూ సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు.

అయితే.. ఈ ఫోన్ కాల్ ను ఐటీ అధికారులు ట్రాప్ చేస్తున్న విషయాన్ని ఇరువురూ గుర్తించలేదు. ఇప్పుడే ఇద్దరి కొంప మునిగిపోయేలా చేసింది. నోట్ల రద్దు నేపథ్యంలో పాత నోట్లను కొత్తగా మార్చిన ఉదంతంపై శేఖర్ రెడ్డి మీద అధికారులకు ఉప్పందింది. దీంతో.. ఆయన ఫోన్ కాల్స్ మీద దృష్టి పెట్టిన ఐటీ అధికారులకు తమిళనాడు సీఎస్ తో శేఖర్ రెడ్డికి ఉన్న సంబంధాలు వెల్లడయ్యాయి.

ఈ ఆధారంతోనే రామ్మోహన్ రావు మీద ఐటీ దాడులు నిర్వహించినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుకున్న మాటల్లోని సమాచారమే ఐటీ అధికారుల తనిఖీలకు కీలకంగా మారిందని తెలుస్తోంది. అమ్మ మరణించిన రోజున.. కీలకమైన విషయాల్ని వదిలేసి.. కొత్తగా మార్చుకున్న డబ్బుల్ని ఎలా దాచి పెట్టాలన్న అంశంపైమాట్లాడిన ఫోన్ కాల్ శేఖర్ రెడ్డిని.. రామ్మోహన్ ను భారీ మూల్యం చెల్లించేలా చేసిందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/