Begin typing your search above and press return to search.

ఏపీలో గెలుపుపై ఇలా ఆరాతీస్తున్నారు..

By:  Tupaki Desk   |   17 April 2019 9:41 AM GMT
ఏపీలో గెలుపుపై ఇలా ఆరాతీస్తున్నారు..
X
సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ఇంకా నెల రోజుల టైముంది. ఓటర్లు ఈనెల 11న తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక ఈవీఎంలనే నమ్ముకున్న పార్టీ నేతలు, అభ్యర్థులు అవిచ్చే ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి ఫలితాలకు ఎక్కువ సమయం దొరికినందున దీనిని కొందరు క్యాష్‌ చేసుకుంటున్నారు. ఫలితాల కంటే ముందే తమ పార్టీ గెలుస్తుందా..? లేదా ముందే సర్వేల ద్వారా తెలుసుకుంటున్నారు. ఇన్ని రోజులు ఇతర సంస్థలపై ఆధారపడిన పార్టీలు ఇప్పుడు సొంతంగా.. కొత్త పద్ధతిలో సర్వే చేస్తూ గెలుపోటములపై బేరీజు వేసుకుంటున్నారు.

ఎన్నికల హడావుడి అయిపోయినా ఎండ వేడి తగ్గలేదు. దీంతో కాస్త రిలాక్స్‌ అవుతామనుకున్న పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ వ్యక్తికి ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. 'హలో సార్‌.. మీది పాలకొల్లేనా..? మొన్నటి ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేశారు..?' అంటూ అవతల నుంచి ఓ వ్యక్తి అడిగారు. సరే..అని ఫలానా పార్టీకి వేశానని చెప్పాడు. గంట తరువాత మరో కాల్‌ వచ్చి ఇదే కొశ్చన్‌..! ఇలా రోజుకు రెండు మూడు కాల్స్‌ వచ్చి అభిప్రాయాలు అడగడం మొదలు పెట్టారు. దీంతో చిర్రెత్తుకొస్తున్న సామాన్యుడు ఓట్లేశాఖ కూడా ఇదేం ఖర్మరా బాబు..! అని అనుకుంటున్నాడు.

అయితే ఈ ఫోన్‌ కాల్స్‌ చేసేది.. పార్టీలకు సంబంధించిన వారా..? లేక పందెం రాయుళ్లా..? అనేది తెలియడం లేదు. గతంలో కొన్ని సంస్థలు సర్వే నిర్వహించి ఓటరు నాడి పట్టేవారు. కానీ ప్రస్తుతం ఏపీలో త్రిముఖ పోరు సాగింది. గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, తదితర విషయాల్లో మెరుగ్గా ఉన్న తమ పార్టీకే ప్రజలు మళ్లీ పట్టం కడుతారని టీడీపీ ఆశతో ఉంది. ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతతో పాటు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని జనం చూస్తున్నారని వైసీపీ భావిస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్న పార్టీలను కాకుండా ఓటర్లు మార్పును కోరుకుంటున్నారని, అందువల్ల తమ పార్టీని ఆదరించడం తథ్యమని జనసేన ధీమాతో ఉంది.

ఇలా మూడు పార్టీలో పోటాపోటీగా ఉండడంతో ఓటరు దేనికి ఓటు వేశాడో అర్థం కావడం లేదు. దీంతో అటు పార్టీల నుంచి ఫోన్‌ చేసి మరీ ఓటు దేనికేశావని అడుగుతున్నారు. ఇక ఈ పరిస్థితిపై కొందరు పందెం రాయుళ్లు జోరుగా బెట్టింగులు కాస్తున్నారు. ముఖ్యంగా పవన్‌ గెలుపుపై లక్ష్యల్లో పందేలు కాయడం విశేషం. ఆయన రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసినా భీమవరంలో గెలుస్తారని కొందరు పందె కాస్తుండగా.. వైసీపీకి ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయని ఇంకొందరు బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ బెట్టింగులు ఎక్కువగా భీమవరం, ఆచంట, పాలకొల్లులో ఎక్కువగా నడుస్తున్నట్లు సమాచారం. మరి ఈ బెట్టింగుల్లో ఎవరు నెగ్గుతారో..? ఎవరు ఓడుతారో..? తేలాలంటే మే 23 వరకు ఆగాల్సిందే..?