Begin typing your search above and press return to search.

ఫోన్‌ ట్యాపింగ్‌ ఏమైంది!?

By:  Tupaki Desk   |   27 Jun 2015 1:30 PM GMT
ఫోన్‌ ట్యాపింగ్‌ ఏమైంది!?
X
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఏమైంది? దానిని ఏపీ సర్కారు చాపచుట్టేసినట్లేనా? దానిని కేవలం కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికే తెరపైకి తెచ్చారా? చంద్రబాబుపై కేసు నమోదు చేయకుండా అడ్డుకోవడానికే దానిని అస్త్రంగా సంధించారా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి.

ఫోన్‌ ట్యాపింగ్‌ను ఏపీ సర్కారు తెరపైకి తెచ్చి నాలుగు రోజులు హడావుడి చేసినా ఇప్పుడు దానిని పూర్తిస్థాయిలో చాపచుట్టేసి అటక ఎక్కించేసింది. దానిపై టీడీపీకి చెందిన ఏ ఒక్కరూ మాట్లాడడం లేదు. చంద్రబాబుపై కేసీఆర్‌ ప్రభుత్వం కేసు నమోదు చేస్తుందన్న ఊహాగానాలు వచ్చినప్పుడు మాత్రమే దీనిని తెరపైకి తీసుకొచ్చారు. ఒకవేళ ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని, దాని వివరాలు బయట పెడతామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దానిని ఎందుకు చేయలేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వకుండా, ఆయనపై కేసు నమోదు చేయకుండా టీఆర్‌ఎస్‌ సర్కారును బ్లాక్‌మెయిల్‌ చేయడానికే ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి హడావుడి చేసిందా అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.

ఓటుకు నోటు కంటే ఫోన్‌ ట్యాపింగ్‌ మరింత తీవ్రమైన నేరమని, నేరం జరిగిందని తెలిసిన తర్వాత కూడా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనినిబట్టి తెర వెనుక లోపాయికారీ వ్యవహారాలు ఏవో జరుగుతున్నాయనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.