Begin typing your search above and press return to search.

ఫూల‌న్ దేవీ క‌థ ఇప్పుడు వింటే షాక‌వుతారు

By:  Tupaki Desk   |   23 Feb 2017 12:03 PM GMT
ఫూల‌న్ దేవీ క‌థ ఇప్పుడు వింటే షాక‌వుతారు
X
ఫూల‌న్‌ దేవి....ఈ పేరు గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. మూడు ద‌శాబ్దాల కింద‌ట ఈ పేరు దేశంలో మారుమోగేది. ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ లోని చంబ‌ల్ ప్రాంతంలో అగ్ర‌వ‌ర్ణ ఠాకూర్‌ ల‌పై ఆమె చేసిన తిరుగుబాటు... ఆమెకు బందిపోటు రాణి అనే పేరు తెచ్చిపెట్టింది. ఆ త‌ర్వాత ఎంపీగా కూడా ఫూల‌న్ దేవీ ప‌నిచేసింది. అలాంటి వ్య‌క్తి త‌ల్లి ఇప్పుడు ఆక‌లితో అల‌మటిస్తోంది. న‌మ్మ‌లేక‌పోయిప్ప‌టికీ ఇది ఆశ్చ‌ర్య‌పోయే వాస్తవం! చంబ‌ల్ లోయ ప్రాంతంలో గ‌తేడాది ఈ ప్రాంతంలో ఏర్పడిన క‌రువు ప‌రిస్థితుల‌పై ఓ ఎన్జీవో నిర్వ‌హించిన స‌ర్వేలో ఫూల‌న్‌ దేవి త‌ల్లి మూలా దేవి దీన‌స్థితి తెలిసొచ్చింది.

బుందేల్‌ ఖండ్ ద‌ళిత్ అధికార్ మంచ్ అనే ఎన్జీవో నిర్వ‌హించిన స‌ర్వేలో త‌ల్లి మూలాదేవితోపాటు ఫూల‌న్ చెల్లెలు రామ్‌క‌లి ఓ చిన్న గుడిసెలో ఉంటున్న‌ట్లు ఆ ఎన్జీవో గుర్తించింది. పూల‌న్‌ దేవి చెల్లెలు రామ్‌క‌లి ప‌నికి ఆహార ప‌థ‌కం కింద కూలీ చేస్తూ నెల‌కు రూ.300 నుంచి 400 మాత్ర‌మే సంపాదిస్తున్న‌ద‌ని ఆ ఎన్జీవో వెల్ల‌డించింది. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే రాజ‌కీయ నేత‌లు త‌మ‌ను క‌ల‌వ‌డానికి వ‌స్తున్నార‌ని రామ్‌ క‌లి చెప్పింది. త‌న‌ను ఎన్నిక‌ల ప్ర‌చారంలో స్టేజీపై నిల్చోబెడ‌తార‌ని, దానికోసం రెండు వంద‌లు ఇస్తార‌ని ఆమె తెలిపింది. రెండేళ్లుగా తాను ఇలాంటి వాటికి వెళ్ల‌డం లేద‌ని, దీంతో కొంద‌రు అభ్య‌ర్థులు త‌మ‌ను బెదిరిస్తున్నార‌ని రామ్‌ క‌లి చెప్ప‌డం గ‌మ‌నార్హం. 1983లో పోలీసుల ఎదుట లొంగిపోయిన ఫూల‌న్‌ దేవి.. 1994లో విడుద‌లైంది. ఆ తర్వాత 1996లో - 1999లో రెండుసార్లు స‌మాజ్‌ వాదీ పార్టీ నుంచి లోక్‌ స‌భ‌కు ఎన్నికైంది. 2001లో ఆమెను త‌న అధికార నివాసం ముందే కొంద‌రు దుండ‌గులు కాల్చి చంపారు. ఆమె హ‌త్య త‌ర్వాత త‌మ భూమిని క‌బ్జా చేశార‌ని, ఇల్లు - పెట్రోల్ బంకు ఆక్ర‌మించుకున్నార‌ని రామ్‌ క‌లి చెప్పింది. ఫూల‌న్ దేవీ హ‌త్య అనంత‌రం త‌మ పార్టీ నుంచి రామ్‌ క‌లికి టికెట్ ఇస్తామ‌ని ఎస్పీ అధినేత‌ ములాయంసింగ్ మాట ఇచ్చినా.. త‌ర్వాత ఆమె గురించిన వార్త‌లు ప‌త్రిక‌ల్లో రావ‌డం ఆగిపోవ‌డంతో ఆయ‌న మ‌ర‌చిపోయార‌ని ఫూల‌న్ త‌ల్లి వాపోయింది.

ఫూల‌న్‌ దేవి ఊరు జ‌లౌన్ జిల్లాలోని క‌ల్పి అసెంబ్లీ స్థానం కిందికి వ‌స్తుంది. ప్ర‌స్తుతం యూపీ ఎన్నిక‌ల్లో ఈ స్థానం నుంచి ప‌ది మంది పోటీ చేస్తున్నారు. 17 ఏళ్ల కింద‌ట ఏ ఇంటి నుంచి ఓ ఎంపీ ఉండేదో.. ఆ ఇంట్లోని వారి ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఇలా ఉందంటే తాము న‌మ్మ‌లేక‌పోయామ‌ని బుందేల్‌ ఖండ్ ద‌ళిత్ అధికార్ మంచ్ ఎన్జీవో క‌న్వీన‌ర్ కుల్దీప్ బౌధ్ అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/