Begin typing your search above and press return to search.

సివిల్స్ మూడో ర్యాంకర్ కు దొంగ సర్టిఫికేట్ల చిక్కు

By:  Tupaki Desk   |   27 Jun 2017 7:30 AM GMT
సివిల్స్ మూడో ర్యాంకర్ కు దొంగ సర్టిఫికేట్ల చిక్కు
X
మొన్నటి సివిల్స్ ఫలితాల్లో మూడో ర్యాంకు సాధించి అందరి దృష్టినీ ఆకర్షించిన శ్రీకాకుళానికి చెందిన రోణంకి గోపాలకృష్ణ చిక్కుల్లో పడ్డారు. తెలుగు మీడియంలో పరీక్ష రాసి మంచి ర్యాంకు సాధించిన గోపాలకృష్ణ ఆ తరువాత హీరో అయిపోయారు. ముఖ్యంగా ఆయన కుటుంబ నేపథ్యం.. తన కుటుంబాన్ని గ్రామం వెలివేసిందంటూ ఆయన చెప్పిన వివరాలు వంటివన్నీ ఆయనపై ఎక్కడలేని సింపథీని కూడా తెచ్చాయి. ఇదంతా ఒకెత్తయితే ఇప్పుడాయనపై కొత్త ఆరోపణలు వస్తున్నాయి. గోపాలకృష్ణ తప్పుడు సర్టిఫికేట్లతో ఉద్యోగం కొట్టేశాడంటూ ఓ న్యాయవాది కేసు వేయడం సంచలనంగా మారింది.

గోపాలకృష్ణ తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి సివిల్స్‌ లో నెగ్గారంటూ ఎం మురళీకృష్ణ అనే న్యాయవాది కోర్టులో కేసు వేశారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారించనున్నారు. గోపాలకృష్ణకు అంగవైకల్యం లేకున్నా తప్పుడు పత్రాలతో పరీక్షలకు హాజరయ్యారన్నది న్యాయవాది ఆరోపణ. ఓబీసీ అయిన గోపాలకృష్ణ ఆర్థోపెడిక్‌ విభాగంలో 45 శాతం మేర అంగవైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించారని మురళీకృష్ణ ఆరోపిస్తున్నారు.

ఓబీసీలకు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత మార్కులు 110.66 కాగా గోపాలకృష్ణ 91.34 మార్కులే సాధించాడని పిల్‌ లో వివరించారు. వికలాంగ కోటా కింద అర్హత మార్కులు 75.34 కావడంతో తప్పుడు సర్టిఫికేట్‌ ద్వారా గోపాలకృష్ణ మెయిన్‌ పరీక్షకు అర్హత సాధించారని ఆరోపిస్తున్నారు. ఓబీసీ కేటగిరిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెయిన్స్‌కు అర్హత సాధించలేదని, వికలాంగుల కోటా కింద మాత్రమే అర్హత సాధించారని పిల్‌లో వివరించారు. మెయిన్స్‌లో సాధారణ అభ్యర్థులకు పరీక్షా సమయం 3 గంటలు కాగా, వికలాంగ అభ్యర్థులకు 4 గంటలని, దీని ద్వారా కూడా గోపాలకృష్ణ లబ్ది పొందారన్నారు. అతడు చెబుతున్న వైకల్యంపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ గోపాలకృష్ణ అంగవైకల్యంపై విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అంతేకాక అతనికి ఐఏఎస్‌ సర్వీసు కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయవాది మురళీకృష్ణ కోరారు. ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/