Begin typing your search above and press return to search.

సైదాబాద్ దుర్ఘటన..రేపిస్ట్ రాజు మృతిపై హైకోర్టులో పిల్

By:  Tupaki Desk   |   17 Sep 2021 3:30 PM GMT
సైదాబాద్ దుర్ఘటన..రేపిస్ట్ రాజు మృతిపై హైకోర్టులో పిల్
X
సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడు రాజు మృతిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. రాజుది ఆత్మహత్య కాదని, కస్టోడియల్ మరణంగా అనుమానం ఉందని చెప్తూ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ ఈ పిల్ వేశారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు హైకోర్టు ఈ పిల్ ను విచారించనుంది.

కాగా, చిన్నారి అత్యాచారం, హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందే. ప్రభుత్వం అసలు స్పందించలేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. వారమవుతున్నా నిందితుడిని పోలీసులు పట్టుకోలేదని, ఎన్ కౌంటర్ చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. నిందితుడు వేషాలు మారుస్తూ తప్పించుకు తిరుగుతున్నాడంటూ పోలీసులు వెల్లడించారు. నిన్న వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృతదేహం లభ్యమైంది. రైలుకు ఎదురెళ్లి రాజు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులూ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అతడి మరణంపై ఎన్నో అనుమానాలున్నాయని, దీనిపై వెంటనే విచారణ జరిపించాలని కోరుతూ లక్ష్మణ్ పిల్ వేశారు.

సైదాబాద్‌లోని సింగరేణి కాలనీకి చెందిన ఆరేళ్ల చిన్నారిని మానవ మృగం రాజు అత్యాచారానికి పాల్పడి దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 9 నుంచి పరారీలో ఉన్న రాజు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.నిందితుడు అత్యాచారం, హత్య చేసిన తర్వాత పోలీసు కన్నుగప్పి తిరుగుతున్న నేపథ్యంలో అతన్ని పట్టుకునేందుకు వినూత్న రీతిలో ప్రచారం చేశారు. అన్ని జిల్లాలలను అప్రమత్తం చేశారు.. నిందితుడి చిత్రాలతో పాటు, ఊహా చిత్రాలను కూడా విడుదల చేసి అలర్ట్ చేశారు. ఇంతలోనే రాజు ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో రాజు స్టేషన్ ఘన్‌పూర్‌కు సమీపంలో రైల్వే ట్రాక్‌పై గురువారం ఉదయం శవమై తేలాడు. రాజు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రకటించారు. కానీ ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేసేవారు కూడా లేకపోలేదు.