Begin typing your search above and press return to search.

విమానం నుంచి జారి పెర‌ట్లో ల్యాండ్ అయింది!

By:  Tupaki Desk   |   16 Aug 2017 6:57 PM GMT
విమానం నుంచి జారి పెర‌ట్లో ల్యాండ్ అయింది!
X
సాధార‌ణంగా మ‌న చేతిలో నుంచి స్మార్ట్ ఫోన్ జారిప‌డితే చాలా సంద‌ర్భాల్లో ప‌గిలిపోతుంది. ఒక వేళ ప‌గ‌ల‌క‌పోయినా స్క్రీన్ మీద గీత‌లు ప‌డ‌డ‌మో, ఫోన్ ప‌నిచేయ‌క‌పోవ‌డ‌మో జ‌రుగుతుంది. అదే, ఒక వేళ వేల అడుగుల ఎత్తులో ప్ర‌యాణిస్తున్న‌ విమానంలో నుంచి స్మార్ట్ ఫోన్ జారిప‌డితే ఇంకేమన్నా ఉందా? అది క‌చ్చితంగా ముక్కలు ముక్కల‌యిపోతుంది. కానీ, అమెరికాలో ఓ వింత ఘ‌ట‌న జ‌రిగింది. వేల అడుగుల ఎత్తులో ప్ర‌యాణిస్తున్న విమానం నుంచి జారిప‌డ్డ ఫోన్ చెక్కు చెద‌ర‌లేదు. అంత ఎత్తు నుంచి కిందపడ్డా ఆ ఫోన్‌పై అనూహ్యంగా చిన్న గీత కూడా పడలేదు. ఆ ఫోన్ కిందప‌డుతున్నపుడు రికార్డు అయిన‌ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

అమెరికాలోని టెన్నెస్సీకి చెందిన బ్లేక్‌ హెండర్సన్ ఆదివారం ఓ చిన్నతరహా విమానంలో ప్రయాణిస్తున్నాడు. త‌న‌కు అతి సమీపం నుంచి వేరొక విమానం రావ‌డాన్ని గ‌మ‌నించి దానిని రికార్డు చేసేందుకు త‌న శాంసంగ్ గెలాక్సీ ఎస్5 మొబైల్‌ ఫోన్ లో కెమెరా ఆన్ చేశాడు. అనుకోకుండా, అత‌డి చేతిలో ఉన్న ఫోన్ విమానం నుంచి జారి కింద‌ప‌డిపోయింది. అయితే, ఆ ఫోన్ రికార్డు మోడ్ లో ఉండ‌డం వ‌ల్ల వేల అడుగుల ఎత్తు నుంచి కిందికి పడుతున్న దృశ్యాలను కూడా చిత్రీకరించింది. విమానంలో నుంచి జారిప‌డ్డ ఆ ఫోన్ ఒక ఇంట్లోని పెరట్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. అంతేకాదు, పెర‌ట్లో ప‌డ్డ త‌ర్వాత కూడా ఆ ఫోన్ లో వీడియో రికార్డు అవుతూనే ఉంది. దీనిని గ‌మ‌నించిన‌ ఆ ఇంటి య‌జ‌మానులు ఫోన్ ఎక్క‌డ నుంచి ఊడిప‌డిందో అంటూ ఆశ్చ‌ర్యానికి గురయ్యారు.

త‌న‌ ఫోన్ పై ఆశ‌లు వ‌దులుకోని హెండ‌ర్స‌న్ టెలికాం కంపెనీని ఆశ్ర‌యించాడు. వారి సహాయంతో జీపీఎస్‌ ద్వారా త‌న ఫోన్ ఉన్న లొకేష‌న్ ను గుర్తించాడు. చివ‌ర‌కు హెండర్సన్ తాను పోగొట్టుకున్న మొబైల్‌ను తిరిగి పొందాడు. అంత ఎత్తునుంచి పడినా ఫోన్‌ కు చిన్న గీత కూడా పడకపోవడంతో హెండర్సన్ షాక్ అయ్యాడు. అత‌డి బంధువొకరు.. ఫోన్‌లో రికార్డయిన వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేయగా అది వైరల్‌ అయింది. హెండ‌ర్స‌న్ చాలా ల‌క్కీ ఫెలో అని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.