Begin typing your search above and press return to search.

వావ్ గ్రేట్: ఆ పైలెట్ సమయస్ఫూర్తిని అభినందించకుండా ఉండలేం

By:  Tupaki Desk   |   23 Aug 2021 2:56 AM GMT
వావ్ గ్రేట్: ఆ పైలెట్ సమయస్ఫూర్తిని అభినందించకుండా ఉండలేం
X
ఇరవైఏళ్లు ఇటుక ఇటుక పేర్చుకుంటూ కట్టిన అఫ్గాన్ పునర్నిర్మాణం మొత్తం తాలిబన్ల పుణ్యమా అని వారమంటే వారంలో మొత్తం నాశనమైపోయింది. చెప్పిన మాటలకు చేసే పనులకు ఏ మాత్రం తేడా లేకుండా వ్యవహరించిన వారి తీరుతో యావత్ ప్రపంచం గగ్గోలు పెడుతోంది. ఏం తప్పు చేశారని.. అఫ్గాన్ ప్రజలకు ఈ శిక్ష అన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రపంచ దేశ ప్రజల స్పందన ఇలా ఉంటే.. అఫ్గాన్ లోని వారు బతికి ఉంటే చాలు.. అన్నట్లుగా ఆస్తుల్ని వదిలేసి.. విదేశాలకు వెళ్లిపోతున్నారు. అఫ్గాన్ నరకం నుంచి బయటపడితే చాలు భగవంతుడా? అన్నట్లు వారి పరిస్థితి ఉంది.

తాజాగా అలాంటి ఉదంతాలు అంతకంతకూ ఎక్కవైపోతున్నాయి. అఫ్గాన్ కు చెందిన నిండు గర్భిణి అమెరికాకు చెందిన సీ17 విమానం ఎక్కారు. అది జర్మనీలోని అమెరికాకు చెందిన రామ్ స్టెయిన్ బేస్ వెళుతోంది. ప్రయాణంలో భాగంగా విమానం ఆకాశంలో భూమికి 8500 మీటర్ల ఎత్తుకు చేరుకోవటంతో లో ఎయిర్ ప్రెషర్ ఏర్పడింది. దీంతో.. ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. ఊపిరి పీల్చుకోలేని దుస్థితి. దీంతో ఆమె పరిస్థితి ఆందోళకరంగా మారింది.

దీంతో.. విషయం తెలిసిన పైలెట్ వెంటనే స్పందించి.. కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. లోపల వాయు పీడనాన్ని పెంచటం.. విమానాన్ని తక్కువ ఎత్తులో వెళ్లేలా చేశారు. ఆమె పరిస్థితి గురించి ముందస్తుగా సమాచారం ఇవ్వటంతో.. ఎయిర్ బేస్ దగ్గర వైద్యులతో సహా అన్ని ఏర్పాట్లు చేశారు. విమానం ల్యాండ్ అయ్యి అయిన వెంటనే పేషెంట్ కు విమానంలోనే డెలివరీ చేశారు. ఆమెకు పడంటి ఆడబిడ్డ జన్మించింది.

అనంతరం తల్లీకుమార్తెల్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగై.. నిలకడగా ఉందని.. ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది. తమ పైలెట్ సమయస్ఫూర్తిని తెలియజేస్తూ ఎయిర్ మొబిలిటీ కమాండ్ అధికారులు జరిగిన ఉదంతం గురించి ట్విటర్ లో వెల్లడించారు. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా పైలెట్ సమయస్ఫూర్తిని అభినందిస్తున్నారు. ఏమైనా.. సదరు పైలెట్ గ్రేట్ అంటే గ్రేట్ అనకుండా ఉండలేం కదా!