Begin typing your search above and press return to search.

గాల్లో విమానం...గాల్లోనే ప్ర‌యాణికుల ప్రాణం!

By:  Tupaki Desk   |   1 Aug 2016 11:43 AM GMT
గాల్లో విమానం...గాల్లోనే ప్ర‌యాణికుల ప్రాణం!
X
ఒక ఆటో డ్రైవ‌ర్ పూటుగా తాగి వాహ‌నం న‌డుపుతున్నాడ‌ని తెలిస్తే భ‌య‌ప‌డిపోతాం! నిబంధ‌న‌లకు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తిస్తే టెన్ష‌న్ ప‌డిపోతాం. బ‌స్సు అయినా ఎయిర్ బ‌స్సు అయినా, దాన్ని న‌డిపే సిబ్బంది ప‌ద్ధ‌తిగా లేక‌పోతే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది క‌దా! ఇప్పుడు అలానే గుండెల్ని గుప్పిట్లో పెట్టుకుని విమానాల్లో ప్ర‌యాణించాల్సిన ప‌రిస్థితి ఉందా... అంటే అవున‌నే చెప్పాల్సి వ‌స్తోంది. ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌కు తూట్లు పొడుస్తున్న కొంతమంది పైలెట్ల భాగోతం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. గ‌డ‌చిన ఆరు నెలల్లో మ‌న‌దేశంలో భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌ను ఉల్లంఘించిన 62 మంది పైల‌ట్ల‌ను విధుల నుంచి బ‌హిష్క‌రించిన‌ట్టు పౌర విమాన‌యాన విభాగ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ (డీజీసీఏ) తాజాగా వెల్ల‌డించ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. ఇక‌, గ‌త ఏడాదిలో 93 మంది పైలెట్లుపై కూడా ఇలాంటి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయ‌నీ, వాటిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారూ అంటూ స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద ఓ పౌరుడు ద‌ర‌ఖాస్తు చేయ‌డంతో ఈ విష‌యాల‌న్నీ వెలుగులోకి వ‌చ్చాయి.

గ‌త ఏడాది కాలంలో స‌గ‌టున నెల‌కి ఓ 8 మంది పైలెట్లు ఇలానే భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌ను పాటించ‌కుండా విధుల‌కు వ‌చ్చేవార‌ట‌. ఈ ఏడాది ఆ సంఖ్య 10కి పెర‌గ‌డం విశేషం. మ‌ద్యం సేవించి విధుల‌కు హాజ‌ర‌వుతున్న పైల‌ట్ల సంఖ్య వీరిలో ఎక్కువ‌గా ఉంటుండం మ‌రీ ఆశ్చ‌ర్య‌క‌రం. బ్రీత్ ఎన‌లైజ‌ర్ టెస్ట్‌ లో బుక్ అయిపోయిన కొంత‌మంది పైలెట్ల‌పై డీజీసీఏ చ‌ర్య‌లు తీసుకుంది. తాగ‌డ‌మే కాకుండా, ర‌న్‌ వేపై విమానం ఉన్న‌ప్పుడు నిబంధ‌న‌లు పాటించ‌నివారు, విధుల‌కు ఆల‌స్యంగా వ‌చ్చేవారు, ఇత‌ర భ‌ద్ర‌తా ఉల్లంఘ‌ల‌న‌కు పాల్ప‌డిన వారిని గుర్తించార‌ట‌. ఇలాంటి వాటిపై డీజీసీఏ కేసులు న‌మోదు చేస్తుంది. చ‌ర్య‌లు తీసుకుంటుంది. అయితే, వివ‌రాల‌ను బ‌య‌ట‌కి వెల్ల‌డించ‌రాద‌ని ఒక సీనియ‌ర్ అధికారి అభిప్రాయ‌ప‌డ్డారు. స‌మ‌చార హ‌క్కు చ‌ట్టం అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో విమాన భ‌ద్ర‌తా ఉల్లంఘ‌న‌ల స‌మాచారాన్ని ప్ర‌జ‌ల ముందు ఉంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఎయిర్ ఇండియా మాజీ కార్య‌నిర్వాహ‌న సంచాల‌కులు జితేంద‌ర్ భార్గ‌వ్ అభిప్రాయ‌ప‌డుతున్నారు

భ‌ద్ర‌త ఉల్లంఘ‌న‌కు సంబంధించిన మ‌రికొన్ని వివ‌రాల‌ను సాక్షాత్తూ కేంద్ర విమాన‌యాన శాఖ స‌హాయ మంత్రి మ‌హేష్ శ‌ర్మ ఇటీవ‌లే లోక్ స‌భ‌లో వెల్ల‌డించారు. గ‌డ‌చిన మూడేళ్ల‌లో 122 మంది పైలెట్ల‌పై కేసులు న‌మోదే చేశామ‌నీ, వీరంతా మ‌ద్యం సేవించి విమానాలు న‌డిపిన‌ట్టు గుర్తించామ‌ని చెప్ప‌డం ఆందోళ‌న‌క‌రం. దీంతో విమాన ప్ర‌యాణంపైనే ర‌క‌ర‌కాల అనుమానాలు వ్య‌క్తం అవుతున్న ప‌రిస్థితి. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న సిబ్బందిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్న‌ప్పుడే విమాన ప్ర‌యాణం క్షేమం అనే భ‌రోసా ప్ర‌యాణికుల్లో క‌లుగుతుంది. ఆ దిశ‌గా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు క‌ఠినంగానే ఉండాలి.