Begin typing your search above and press return to search.

కేరళ సీఎం ఎవరో తెలిసిపోయింది..

By:  Tupaki Desk   |   20 May 2016 10:42 AM GMT
కేరళ సీఎం ఎవరో తెలిసిపోయింది..
X
కేరళ నూతన ముఖ్యమంత్రిగా ఎవరవుతారన్న విషయంలో స్పష్టత వచ్చింది. మాజీ సీఎం అచ్యుతానందన్ - పినరాయి విజయన్‌ మధ్య తీవ్ర పోటీ నేపథ్యంలో అక్కడ ఎల్డీఎఫ్ బంపర్ మెజారిటీతో విజయం సాధించినా కూడా సీఎం విషయంలో అనిశ్చితి ఉండేది. కానీ, తాజాగా వామపక్ష నేతలు క్లారిటీ ఇచ్చారు. విజయన్ ను కేరళ నూతన ముఖ్యమంత్రి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.

సీపీఎం అధినేతలు సీతారాం ఏచూరి - ప్రకాశ్‌ కారత్‌ లు స్థానిక సిపిఎం నేతలతో ఈ రోజు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చర్చల ఫలితంగా విజయన్ పేరు ఖరారు చేశారు. విజయన్ పేరును ముఖ్యమంత్రి గా ఈ రోజే అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. పార్టీ అగ్రనేతల చర్చల సమయంలో సిపిఎం కురు వృద్ధుడు - కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్‌ అచ్యుతానందన్‌ పార్టీ కార్యాలయంనుంచి హఠాత్తుగా వెళ్లిపోవడంతో ముఖ్యమంత్రి పదవికి విజయన్‌ ఎంపిక అయినట్లు అందరికీ అర్థమైంది. ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్న విజయన్‌ వయస్సులో అచ్యుతానందన్‌ కంటే 20 ఏళ్లు చిన్నవాడు కావడం, పార్టీ రాష్ట్ర కమిటిలో కూడా ఆయనకు మద్దతు అధికంగా ఉండటం వంటి కారణాలతో ఆయనను ఎంపిక చేసినట్లు తెలిసింది.

కేరళలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్‌ ఘన విజయం సాధించి, మొత్తం 140 అసెంబ్లీ సీట్లకు గాను ఎల్‌ డిఎఫ్‌ 92 సీట్లలో గెలిచి అధికారాన్ని చేజిక్కించుకుంది. దీంతో వెంటనే ఈ రోజు సీఎం ఎన్నికపై తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీఐ(ఎం) స్టేట్ కమిటీ.. ఆ పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ పినరాయి విజయన్ ను సీఎంగా నియమించేందుకు నిర్ణయం తీసుకుంది. కాగా విజయన్ వ్యవహార శైలిపై పార్టీవర్గాల్లోనూ అనేక విమర్శలున్నా కూడా ఆయన్ను ఎంపికచేయడంపై రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అచ్యుతానందన్ తో విభేదాలు ఒక్కటే కాకుండా వ్యక్తిగతంగానూ ఆయనపై అవినీతి ఆరోపణలున్నట్లు చెబుతారు. పైగా పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టి వర్గ రాజకీయాలకు ఆయన ప్రాధాన్యం ఇస్తారని అచ్యుతానందన్ వర్గం అంటోంది. గత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కు విజయావకాశాలు ఉన్నప్పటికీ కేవలం విజయన్ కారణంగానే దెబ్బతిన్నామని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో అచ్యుతానందన్ ను కాదని విజయన్ పేరు ఖరారు చేయడంతో భవిష్యత్తులో కేరళ సీపీఎంలో కుమ్ములాటలు తప్పవని తెలుస్తోంది.