Begin typing your search above and press return to search.

తెలుగు ప‌రిర‌క్ష‌ణ‌కు క‌ఠిన నిబంధ‌న‌లు!

By:  Tupaki Desk   |   11 Sep 2018 4:33 PM GMT
తెలుగు ప‌రిర‌క్ష‌ణ‌కు క‌ఠిన నిబంధ‌న‌లు!
X
దేశ‌భాష‌ లందు తెలుగు లెస్స‌. ఇది ఒకప్ప‌టి మాట‌....ఇపుడు దేశ‌భాష‌ల‌తో పాటు ప్ర‌పంచ భాష‌లందు ఇంగ్లిషు లెస్స‌...అందుకే త‌మ పిల్ల‌ల‌ను వేల‌కు వేలు పోసి మరీ ఇంగ్లిషు మీడియం స్కూళ్లలో చదివించేందుకు త‌ల్లిదండ్రులు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. వారి అభిరుచికి త‌గ్గ‌ట్లే...చాలా పాఠ‌శాలల్లో తెలుగు మాట్లాడితే జ‌రిమానాలు కూడా విధించేస్తున్నారు. ఈ క్ర‌మంలో నానాటికీ తెలుగు భాషకు తెలుగు రాష్ట్రంలోనే ప్రాధాన్య‌త త‌గ్గిపోతోంద‌ని భాషా పండితులు - తెలుగు భాషాభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలోనే తెలుగు భాష‌ను ప‌రిర‌క్షించేందుకు ఏపీ స‌ర్కార్ కూడా కొంత‌కాలం క్రితం కొన్ని నిబంధ‌న‌లు విధించింది. రాష్ట్రంలోని వ్యాపార సంస్థలు - వాణిజ్య దుకాణాల బోర్డులను తప్పనిసరిగా తెలుగులోనే రాయాలని గ‌తంలోనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ నిబంధ‌న అతిక్ర‌మిస్తే జ‌రిమానా కూడా విధిస్తామని ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది. అయితే, ఆ నిబంధన క్షేత్ర‌స్థాయిలో అమ‌లుకాక‌ పోవ‌డంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ...మ‌రిన్ని క‌ఠిన నిబంధ‌న‌లు తీసుకువ‌చ్చేందుకు రంగం సిద్ధం చేసింది.

ఇకపై బోర్డులు తెలుగులోనే ఉండాలన్న నిబంధనను ఉల్లంఘించిన వారికి కనీసం రూ. 3000 రూపాయలు జరిమానాను విధించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. గతంలో 500 రూపాయలుగా ఉన్న జ‌రిమానాను...3 వేల‌కు పెంచింది. ఇందుకు సంబంధించి మ‌రో రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలిసింది. దానికి సంబంధించిన‌ ఫైలు సీఎం ఆమోదం కోసం పంపించామ‌ని కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ వెల్ల‌డించారు. జరిమానా కట్టిన త‌ర్వాత కూడా దుకాణ‌దారుల్లో మార్పు రాకపోతే కఠిన చర్యల తీసుకునేలా ఆ ఉత్త‌ర్వుల్లో మార్గదర్శకాలను పొందుపరిచామ‌ని ఆయ‌న అన్నారు. దీంతోపాటు, అన్ని రకాల నామఫలకాలు - శిలాఫలకాలు తెలుగులో ఉండాల‌ని, లేకుంటే రూ. 10వేలు జరిమానా విధించేలా నిబంధనలు రాబోతున్న‌ట్లు తెలుస్తోంది. తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపని ప్రభుత్వ శాఖలకు కూడా రూ. 5 వేలు అపరాధ రుసుం విధించేలా యోచిస్తున్నార‌ట‌. విద్యా సంస్థల నిర్వాహకులు తెలుగును బోధనాంశంగా అమలు చేయకుంటే జరిమానా,జైలు తప్పదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.