Begin typing your search above and press return to search.

బాబు కి హ్యాండ్ ఇవ్వబోతున్న ఆ మంత్రి!?

By:  Tupaki Desk   |   7 March 2019 2:21 PM GMT
బాబు కి హ్యాండ్ ఇవ్వబోతున్న ఆ మంత్రి!?
X
ఇప్పటికే పలువురు నేతలు తెలుగుదేశం పార్టీని వీడారు. వారిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు - ఎంపీలు - తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జిలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ఎన్నికల బరిలో దిగాల్సిన వాళ్లంతా ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వారిలో ఒకరు మినహా అందరూ చేరారు.

ఈ జాబితాలో మరింత మంది నేతలు ఉంటారనే ప్రచారం మొదటి నుంచి జరుగుతున్నదే. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు అందుకు సంబంధించి మరో పేరు తెర మీదకు వస్తోంది. అదే పితాని సత్యనారాయణ. ఆచంట నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నెగ్గారు పితాని. అంతకు ముందు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అదే నియోజకవర్గం నుంచి నెగ్గారు.

ఇలా వరసగా రెండు సార్లు ఆ నియోజకవర్గం నుంచి నెగ్గిన పితాని ఈ సారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే ఓటమి ఖాయమని తేలిందట. ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యామ్నాయ మార్గంలో ఉన్నట్టుగా సమాచారం. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీని వీడటం అయితే ఖాయమైందట.

ఇప్పటికే చంద్రబాబుకు అందుబాటులో లేకుండా పోయాడట పితాని. ఆయనను బుజ్జగించడానికి స్వయంగా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగినా ప్రయోజనం కనపడటం లేదని.. చంద్రబాబుతో మాట్లాడటానికి పితాని సంసిద్ధంగా లేరని.. ఆయన తెలుగుదేశం పార్టీని వీడేందుకు రెడీ అయ్యారని వార్తలు వస్తున్నాయి.

బాబు బుజ్జగింపులకు కూడా సదరు మంత్రి అందడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లారు. ఇప్పుడు ఏకంగా ఒక మంత్రి హోదాలోని వ్యక్తి రాజీనామా చేసి బయటకు వెళితే అప్పుడు .. తెలుగుదేశం గ్రాఫ్ మరింత పడిపోయే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.