Begin typing your search above and press return to search.

పీయూష్ ను కెలికి తలసాని అడ్డంగా బుక్ అయ్యారే

By:  Tupaki Desk   |   19 Feb 2020 5:00 AM GMT
పీయూష్ ను కెలికి తలసాని అడ్డంగా బుక్ అయ్యారే
X
రాజకీయ ప్రత్యర్థుల విషయంలో దూకుడుగా వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు దిమ్మ తిరిగేలా పంచ్ పడింది. వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడిన ఆయన మాటలకు కేంద్రమంత్రి ఘాటుగా బదులివ్వటం.. దానికి సమాధానం చెప్పలేక తలసాని మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే..

చర్లపల్లి టెర్మినల్ ను ప్రారంభించేందుకు కేంద్ర రైల్వేశాఖా మంత్రి పీయూష్ గోయల్ సికింద్రాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి తలసాని.. కేంద్రం ఉత్తరాది వైపుకే ఎక్కువ రైళ్లను కేటాయిస్తుందని.. దక్షిణాది మీద చిన్నచూపు చూస్తుందన్నారు. రైల్వే మంత్రులు ఉన్న వారి రాష్ట్రాలకే ఎక్కువ రైళ్ల కేటాయింపులు జరుగుతున్నాయన్న విమర్శ చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు కూడా నిధులు కేటాయించాలని కోరారు. ఇలా నార్త్.. సౌత్ పేరు తో మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలు వాతావరణానికి కాస్త హాట్ గా మార్చాయి.

అనంతరం మాట్లాడిన కేంద్రమంత్రి పీయూష్.. తలసానికి దిమ్మ తిరిగేలా పంచ్ ఇచ్చారు. తమకు దక్షిణాది.. ఉత్తరాది అన్న భేదభావం లేదన్న రైల్వే మంత్రి.. హైదరాబాద్ నగరంలోని ఎంఎంటీఎస్ 2 దశను ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన రూ.817కోట్లలో కేంద్ర వాటాగా ఉన్న రూ.272 కోట్లను ఇచ్చేసిందని.. రాష్ట్రం నుంచి రావాల్సిన రూ.544.66 కోట్ల మొత్తంలో సింహభాగం ఇప్పటివరకూ విడుదల కాలేదంటూ గణాంకాల్ని తెర మీదకు తీసుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్రం తన వాటా కింద ఇవ్వాల్సిన రూ.544.66 కోట్లకు ఇప్పటి వరకూ ఇచ్చింది రూ.1.29 కోట్లు మాత్రమేనని లెక్కలు విప్పారు. రాష్ట్రం ఇవ్వాల్సిన నిధుల్ని తొందరగా ఇప్పిస్తే పనులు సకాలంలో పూర్తి చేస్తామని మంత్రి పీయూష్ వేసిన పంచ్ కు మంత్రి తలసాని నోట మాట రాలేని పరిస్థితి. అందుకే అంటారు.. దూకుడు మంచిదే కానీ.. ముందు వెనుకా చూసుకోవటం చాలా ముఖ్యం. ఆ విషయం తాజా ఉదంతంలో మంత్రి తలసానికి బాగానే అర్థమై ఉంటుందని చెప్పక తప్పదు.