Begin typing your search above and press return to search.

కవిత ఓట‌మికి కార‌ణం చెప్పిన కేంద్ర మంత్రి!

By:  Tupaki Desk   |   18 Feb 2020 2:17 PM GMT
కవిత ఓట‌మికి కార‌ణం చెప్పిన కేంద్ర మంత్రి!
X
బీజేపీ అవ‌లంబిస్తోన్న విధానాల‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ - టీఆర్‌ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా వ్య‌తిరేకిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌కు కేంద్రం నిధులు ఇవ్వ‌డం లేద‌ని, త‌మ‌పై కేంద్రం క‌క్ష సాధిస్తోంద‌ని టీఆర్‌ ఎస్ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. కేంద్రం దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేస్తామంటోన్న సీఏఏను తీవ్రంగా వ్య‌తిరేకిస్తోన్న టీఆర్‌ ఎస్ అధినేత కేసీఆర్....తెలంగాణ అసెంబ్లీలో ఆ బిల్లుకు వ్య‌తిరేకంగా తీర్మానం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలోనే టీఆర్‌ ఎస్ స‌ర్కార్‌ పై బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. కేసీఆర్ - కేటీఆర్ ఇద్దరూ అవగాహన లోపంతో కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. మాజీ ఎంపీ క‌విత‌పై కూడా పీయుష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

చ‌ర్ల‌ప‌ల్లిలో శాటిలైట్ రైల్వే స్టేష‌న్‌ - 427 రైల్వే స్టేష‌న్ ల‌లో వైఫై సేవ‌ల‌ను పీయూష్ ప్రారంభించారు.కేసీఆర్ మతత‌త్వ‌ రాజకీయాలకు పాల్పడుతూ ముస్లింలను మభ్యపెడుతున్నారని పీయూష్ గోయ‌ల్ విమ‌ర్శించారు. అందుకే ప్రజలు గత ఎన్నికల్లో కేసీఆర్ త‌న‌యురాలు కవితను ఓడించార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం బాధాకరమని పీయూష్ గోయల్ అన్నారు. పార్లమెంటు చేసిన చట్టాలను అమలు చేయక త‌ప్ప‌ద‌ని అన్నారు. మజ్లిస్ పార్టీ - ఓవైసీల మెప్పు కోసం కేసీఆర్ మత రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిప‌డ్డారు.

ముస్లింలకు 12శాతం మ‌త‌ప‌ర‌మైన రిజర్వేషన్ల ప్ర‌క‌ట‌న రాజ‌కీయ ల‌బ్ధికేన‌ని - అటువంటి టీఆర్ ఎస్ పార్టీకి సీఏఏను వ్యతిరేకించే హక్కు లేదని స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో స‌హ‌క‌రించింద‌న్నారు. అందుకే - రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా ఆగలేదని స్పష్టం చేశారు. దక్షిణ మధ్య రైల్వేకు భారీగా నిధులు కేటాయించామ‌ని - ఒక్క తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకే రూ.2,602 కోట్లు ఇచ్చామని అన్నారు. ఎంఎంటీఎస్ కు కేంద్రం రూ.500 కోట్లు ఇచ్చిందని - రాష్ట్ర ప్రభుత్వమే తన వాటా ఇవ్వలేదని పీయూష్ వెల్ల‌డించారు. ఇక‌నైన కేంద్రంపై విమ‌ర్శ‌లు చేయ‌డం మాని రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాల‌ని అన్నారు.