Begin typing your search above and press return to search.

ఏపీకి క్లారిటీ..కేటీఆర్ చేతిలో బుక్క‌యిన కేంద్ర‌మంత్రి

By:  Tupaki Desk   |   17 March 2018 5:01 PM GMT
ఏపీకి క్లారిటీ..కేటీఆర్ చేతిలో బుక్క‌యిన కేంద్ర‌మంత్రి
X

రాజ‌కీయాల్లో ఒక్కోసారి ఎలాంటి ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాలు చోటుచేసుకుంటాయో తెలియ‌జెప్పేందుకు ఇదో ఉదాహ‌ర‌ణ. ఏపీలోని ప‌రిణామాల నేప‌థ్యంలో క్లారిటీ ఇచ్చేందుకు కేంద్ర మంత్రి ఒక‌రు ప్ర‌య‌త్నం చేయ‌గా అది కాస్త అనూహ్య ట్విస్ట్‌ కు వేదిక అయింది. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడ‌కు ప‌రోక్ష క్లారిటీ ఇచ్చేందుకు చేసిన ప్ర‌య‌త్నం కాస్త ఇంకో రాష్ర్టానికి మంట‌పుట్టేలా చేసింది. ఏపీ సంగ‌తి స‌రే...తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పండి అంటూ సూటిగా ప్రశ్నించేందుకు వేదిక అయింది.

బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన టీడీపీ ఆ వేదిక నుంచి బయటకు రావడం - ఏపీకి సంబంధించిన హామీలను నిలబెట్టుకోవడంలేదని ఆరోపణలు చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్విట్టర్‌ వేదికగా వివరణ ఇచ్చారు. ‘అభివృద్ధి పథం వైపు ఆంధ్రప్రదేశ్‌ సాగుతున్న తీరును ప్రతి ఒక్కరూ గమనించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజల కోసం నిర్విరామంగా కృషిచేస్తున్నాం. ఏపీ వృద్ధిని కొనసాగించేందుకు మద్దతు అందిస్తున్నారు’ అని ట్వీట్‌ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ ఓ ట్వీట్‌ లో తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ కు తామేం చేస్తున్నామో లెక్కలతో సహా చెప్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం అదే రీతిలో గణాంకాలను వివరించాలని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ను ఓ ట్వీట్‌ లో మంత్రి కోరారు.

‘గౌరవ మంత్రిగారు...ఇదే రీతిలో తెలంగాణకు సైతం మీరిచ్చిన హామీలు - నెరవేర్చుకున్న వాటి గణాంకాలు వివరించగలరా? మీకో విషయం గుర్తుచేస్తున్నాను...ఇదే ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో ఏపీలాగానే తెలంగాణకు కూడా ఎన్నో హామీలు ఇచ్చారు. గౌరవంతో...కేటీఆర్‌’ అంటూ ముగించారు! కాగా, ఏపీకి సంబంధించిన క్లారిటీ ఇవ్వ‌బోతే...ప‌క్క‌రాష్ట్రం సైతం అదే ప్ర‌శ్న‌ల‌తో తెర‌మీద‌కు రావ‌డం ఆస‌క్తికర‌మ‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.