Begin typing your search above and press return to search.

ధాన్యం సేకరణ: కేసీఆర్ సర్కార్ తీరును కడిగేసిన పీయూష్ గోయల్

By:  Tupaki Desk   |   4 Dec 2021 12:30 AM GMT
ధాన్యం సేకరణ: కేసీఆర్ సర్కార్ తీరును కడిగేసిన పీయూష్ గోయల్
X
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో వరుసగా ఆందోళనలు చేస్తున్న క్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వంతో ముందుగా చేసుకున్న ఒప్పందం(ఎంవోయూ) ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.

బాయిల్డ్ రైస్ ఎంత కొంటారో స్పష్టం చేయాలంటూ టీఆర్ఎస్ సభ్యుడు కే కేశవరావు(కేకే) రాజ్యసభలో అడిగినప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. సీఎం కేసీఆర్ తోనూ మాట్లాడానని.. వానాకాలం పంట పూర్తిగా కొంటామని స్పష్టం చేశారు. ప్రతీ ఏటా ధాన్యం సేకరణను పెంచుతున్నామని తెలంగాణ నుంచి కూడా బాగా పెంచామని కేంద్రమంత్రి వివరించారు.

ఖరీఫ్ సీజన్లో 50 లక్షల టన్నులు ఇస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. 32.66 టన్నులే ఇచ్చిందని తెలిపారు. ఎంవోయూకు కట్టుబడి ఉండాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. తెలంగాణ అంచనాలకు.. వాస్తవాలకు చాలా తేడా ఉంటోందని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. 2020-21లో 94.5 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని తెలిపారు. ఖరీఫ్ సీజన్ లో 50 లక్షల టన్నులు ఇస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం 32.66 టన్నులే ఇచ్చిందని తెలిపారు.

దేశంలోనే ధాన్యంసేకరణలో కర్ణాటక నమూనా చాలా బాగుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు. దాన్ని అన్నిరాష్ట్రాలు అనుసరించాలని సూచించారు. తెలంగాణ నుంచి 24 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనేందుకు ఒప్పందం జరిగిందని.. 44 లక్షలకు పెంచినా ఇప్పటివరకూ కేవలం 27లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ వచ్చిందన్నారు. ఇంకా 17 లక్షల టన్నులు పెండింగ్ ఉందని చెప్పారు.

బాయిల్డ్ రైస్ పంపబోమని అక్టోబర్ 4న తెలంగాణ రేఖ రాసిందని గుర్తు చేశారు. ఇప్పుడు బాయిల్డ్ రైస్ కొనాలని పదేపదే గొడవ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ధాన్యం విషయాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆగ్రహించారు. తెలంగాణ రాష్ట్రం ధాన్యం లెక్కలను సరిగ్గా నిర్వహించడం లేదన్నారు. సాధ్యమైనంతవరకూ తెలంగాణకు సహకరిస్తోందని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.