Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్ లోకి ఫైర్‌ బ్రాండ్‌.. ఆ సీటుపైనే గురి పెట్టిందే...!

By:  Tupaki Desk   |   19 Jun 2022 9:31 AM GMT
టీ కాంగ్రెస్ లోకి ఫైర్‌ బ్రాండ్‌.. ఆ సీటుపైనే గురి పెట్టిందే...!
X
చూస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ కు మంచి రోజులు వ‌చ్చిన‌ట్లే అనిపిస్తోంది. పార్టీలో నుంచి నేత‌లు ఎప్పుడూ బ‌య‌టికి వెళ్ల‌డ‌మే కానీ రావ‌డం తెలియ‌ని పార్టీకి తాజాగా చేరిక‌లు బూస్టు ఇస్తున్నాయ‌నే చెప్ప‌వ‌చ్చు. ఇటీవ‌ల ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు టీఆర్ఎస్ గూటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి కాంగ్రెస్ ప‌క్షాన చేరారు. ఇపుడు తాజాగా హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన మాజీ మంత్రి పీజేఆర్ కుమార్తె విజ‌యారెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంతుతో భేటీ అయ్యారు.

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఖైర‌తాబాద్ కార్పొరేట‌ర్‌గా ఎన్నికైన విజ‌యారెడ్డి డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వి ఆశించారు. కానీ సీఎం కేసీఆర్ కానీ.. మంత్రి కేటీఆర్ కానీ ప‌ట్టించుకోలేదు. దీంతో మ‌న‌స్తాపం చెందిన విజ‌య‌ ప్ర‌మాణ స్వీకారం రోజునే మ‌ధ్య‌లో వెళ్లిపోయారు. అప్ప‌టి నుంచీ అడ‌పా ద‌డ‌పా మాత్ర‌మే పార్టీ కార్య‌క్ర‌మాల్లో క‌నిపిస్తున్నారు. ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో చ‌క్రం తిప్పాలనుకుంటున్న ఆమెకు దానం నాగేంద‌ర్ ఎమ్మెల్యేగా ఉండ‌డంతో సాధ్య‌ప‌డ‌డం లేదు.

దీంతో తిరిగి సొంత గూటికి రావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామ‌క‌మైన‌ప్ప‌టి నుంచీ ఆయ‌న‌తో ప‌లుమార్లు చ‌ర్చ‌లు జ‌రిపారు. తాజాగా మ‌రోసారి రేవంతుతో భేటీ అయ్యారు. ఈనెల 23న కాంగ్రెసులో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నారు. త‌న తండ్రి ఆశ‌యాల‌కు అనుగుణంగా ప‌నిచేస్తాన‌ని ఆమె తెలిపారు. దీన్ని ముందే గ‌మ‌నించిన టీఆర్ఎస్ పెద్ద‌లు ఆమెను శాంతింప‌చేసే ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ ఫ‌లించ‌లేద‌ని తెలుస్తోంది.

ఎమ్మెల్యే టికెట్ ఆశించి కాంగ్రెసులో చేర‌డం లేద‌ని ఆమె చెబుతున్న‌ప్ప‌టికీ ఖైర‌తాబాద్ స్థానంపైనే గురిపెట్టిన‌ట్లు తెలుస్తోంది. త‌న తండ్రి గెలుపొందిన స్థాన‌మే త‌న‌కు సుర‌క్షిత‌మ‌ని ఆమె భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ ఖైర‌తాబాద్ వీలు కాని ప‌క్షంలో జూబ్లీహిల్స్ నుంచి అయినా బ‌రిలో నిల‌వాల‌ని యోచిస్తున్నారు. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, త‌న సోద‌రుడు విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి ఎలాగూ క్రియాశీల రాజ‌కీయాల ప‌ట్ల ఆసక్తి చూప‌క‌పోవ‌డంతో ఆ స్థానాన్ని అయినా భ‌ర్తీ చేయాల‌ని ఆలోచిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ అంశంపై న‌గ‌ర కాంగ్రెస్ నేత‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. గ్రేట‌ర్ ప‌రిధిలో బ‌ల‌హీనంగా మారి మూడో స్థానానికి ప‌రిమిత‌మైన కాంగ్రెస్ కు ఈ చేరిక‌లు ఊపునిస్తాయ‌నే చెప్పొచ్చు. విజ‌యారెడ్డి మాదిరే అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన నేత‌ల‌ను త‌యారుచేసుకుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌, బీజేపీకి గ‌ట్టి పోటీ ఇవ్వొచ్చ‌ని భావిస్తున్నారు.

చూస్తుంటే కాంగ్రెస్ కు ఘ‌ర్‌వాప‌సీ మొద‌లైన‌ట్లే ఉంది. మొన్న ఉద్య‌మ నేత న‌ల్లాల ఓదెలు చేరారు. ఇపుడు విజ‌యారెడ్డి ఆస‌క్తి చూపించారు. త్వ‌ర‌లో మాజీ మంత్రులు కూడా హ‌స్తం కండువా క‌ప్పుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీన్ని బ‌ట్టి వ‌చ్చేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే న‌న్న అభిప్రాయంలో పార్టీ కేడ‌ర్ ఉంది. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!