Begin typing your search above and press return to search.

వైసీపీని పీకే శాసించ‌లేరు.. ఆయ‌న్ని వాడుకుంటామంతే!

By:  Tupaki Desk   |   26 April 2022 9:30 AM GMT
వైసీపీని పీకే శాసించ‌లేరు.. ఆయ‌న్ని వాడుకుంటామంతే!
X
కాంగ్రెస్ పార్టీని తిరిగి బ‌లోపేతం చేసే దిశ‌గా ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే.. ఆ పార్టీ అధిష్ఠానానికి ఇటీవ‌ల కొన్ని సూచ‌న‌లు చేశార‌ని తెలిసిందే. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావ‌డానికి అనుస‌రించాల్సిన వ్యూహాలు, ప్ర‌ణాళిక‌ల గురించి ఆయ‌న ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారనే వార్త‌లు వ‌చ్చాయి.

అయితే హ‌స్తం పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీతో పొత్తు పెట్టుకోవాల‌ని ఆయ‌న చేసిన ప్ర‌తిపాదన చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏపీ రాజ‌కీయాల్లో ఇది హాట్‌టాపిక్ అయింది. కాంగ్రెస్ మోసం చేసింద‌నే సొంత కుంప‌టి పెట్టుకున్న జ‌గ‌న్‌.. మ‌ళ్లీ ఆ పార్టీతో ఎలా చేతులు క‌లుపుతార‌ని వైసీపీ వ‌ర్గాలు ప్ర‌శ్నిస్తున్నాయి.

ఇప్ప‌టికే పీకే వ్యాఖ్య‌ల‌పై ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ స్పందించారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించే పార్టీకే త‌మ మ‌ద్దతు ఉంటుంద‌ని, పొత్తుల‌పై తుది నిర్ణ‌యం సీఎం జ‌గ‌న్‌దేన‌ని విజ‌యసాయి తెలిపారు. వైఎస్ఆర్ కుటుంబానికి తీర‌ని అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో తాము ఎందుకు క‌లుస్తామ‌ని అమ‌ర్‌నాథ్ అన్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా పార్టీలో కీల‌క‌మైన నేత మాజీ మంత్రి పేర్ని నాని పీకే వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఒంట‌రిగానే బ‌రిలో దిగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. పైగా వైసీపీని ఎవ‌రూ శాసించ‌లేర‌ని, పీకే ఇచ్చే సూచ‌న‌లు మాత్ర‌మే వాడుకుంటామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

"ప్ర‌శాంత్ కిషోర్ మా పార్టీకి క‌న్స‌ల్టెంట్ మాత్ర‌మే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఆలోచ‌న‌లు, ప్ర‌తిపాద‌న‌లు మాత్ర‌మే వాడుకుంటాం. వైసీపీని ఎవ‌రూ శాసించ‌లేరు. ఎన్నిక‌ల‌య్యాక కేంద్రంలో మా ఎంపీల బ‌లం అవ‌స‌రం అనుకునే ఏ కూట‌మికైనా మ‌ద్ద‌తునిస్తాం. కానీ అంత‌కంటే ముందు రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ఆ కూట‌మి కాగితంపై రాసివ్వాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఎవ‌రితోనూ పొత్తు పెట్టుకోదు.

ఒంట‌రిగానే పోటీ చేస్తుంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు వావి వ‌ర‌స‌లు లేవు. చంద్ర‌బాబు కోసం ఆయ‌న చేసే ప‌నిలో ప‌దోవంతు అయిన త‌న అన్న కోసం చేయాలి. నాకు మంత్రి ప‌ద‌వి కంటే జ‌గ‌న్ ఇస్తున్న గౌర‌వ‌మే ఎక్కువ‌. కృష్ణా జిల్లా పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు కోసం ప‌ని చేస్తా" అని పేర్ని నాని తెలిపారు.