Begin typing your search above and press return to search.

ప్ర‌శాంత్ కిశోర్‌కు నీతి ఉందా? నిన్న స్టాలిన్‌.. నేడు విజయ్‌తో రాజ‌కీయాలా?

By:  Tupaki Desk   |   17 March 2022 11:11 AM GMT
ప్ర‌శాంత్ కిశోర్‌కు నీతి ఉందా?  నిన్న స్టాలిన్‌.. నేడు విజయ్‌తో రాజ‌కీయాలా?
X
రాజ‌కీయాల‌ను న‌డిపించేవారిని ప్ర‌జ‌లున‌మ్మాలంటే.. అంతో ఇంతో నిజాయితీ ఉండాలి. నీతి ఉండాలి. అప్పుడు మాత్ర‌మే నాయ‌కులు స‌క్సెస్ అవుతార‌నేది వాస్త‌వం. అయితే.. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిశోర్‌.. ఉర‌ఫ్ పీకే విష‌యంలో ఇలాంటి నీతులు.. నిజాయితీలు.. ఏమీ క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌న‌కు కావాల్సింది.. డ‌బ్బు మాత్ర‌మేన‌ని.. నీతి, నిజాయితీ వంటివాటితో ప‌నిలేద‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీనికి కార‌ణం.. ఏంటంటే..నిన్న‌గాక మొన్న అన్న‌ట్టుగా. గ‌త ఏడాది త‌మిళ‌నాడులో ఏర్ప‌డిన డీఎంకే స‌ర్కారుకు.. పీకే స‌ల‌హాలు ఇచ్చాడు.

అంటే.. ప్ర‌స్తుతం ఉన్న ప్ర‌భుత్వం పీకే స‌ల‌హాల‌తోనే ఏర్ప‌డింద‌ని అనుకుందాం. ఇది ఏర్ప‌డి ఇంకా రెండేళ్లు కూడా కాలేదు. కానీ, ఇంత‌లోనే .. ప‌రోక్షంగా ప్ర‌త్య‌ర్థి పార్టీకి స‌హ‌కారం చేసేందుకు పీకే రంగంలోకి దిగిపోయాడు. త‌మిళ‌నాడులో అధికార‌ డీఎంకే పార్టీకి.. ప్ర‌త్య‌ర్థి పార్టీగా ఉన్న విజ‌య్ మ‌క్క‌ల్ ఇయ‌క్కం.. పార్టీకి సేవ‌లు చేసేందుకు పీకే రంగంలోకి దిగిపోతున్నాడ‌నే వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. రానున్న (2024) లోక్‌సభ ఎన్నికల్లోగా ఈ పార్టీకి వ్యూహాలు అందించేందుకు పీకే సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు మేధావులు సైతం చెబుతున్నారు.

విజ‌య మ‌క్క‌ల్ ఇయ‌క్కం పార్టీని విజ‌య్ తండ్రి.. చంద్ర‌శేఖ‌ర్‌.. స్థాపించారు. అయితే.. ఆదిలో దీనిని విజ‌య్ వ్య‌తిరేకించినా.. త‌ర్వాత‌.. మున్సిపాలిటీ, పట్టణ పంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల విజయ్‌ మక్కల్‌ ఇయక్కంకు చెందిన అభ్యర్థులు గెలుపొందారు. వారందరినీ విజయ్‌ ఇంటికి పిలిపించుకుని ఫొటో దిగారు. ఈ తరుణంలోనే విజయ్‌ మదిలో క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆశలు తలెత్తాయి. ఈ క్ర‌మంలోనే త‌న తండ్రి స్థాపించిన పార్టీని మ‌రింత దూకుడుగా ముందుకు తీసుకువెళ్లాల‌ని.. విజయ్ భావించిన‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌తో నటుడు విజయ్‌ ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో భేటీ కావడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌లో కొన్ని రోజుల క్రితం విజయ్, ప్రశాంత్‌ కిషోర్‌ రహస్యంగా సమావేశమై రాజకీయ చర్చలు సాగించడం ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై విజయ్‌ సన్నిహితుడు మాట్లాడుతూ.. 'తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఏర్పడింది, ఆ పార్టీకి రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. బీజేపీతో పొత్తుపెట్టుకున్న అన్నాడీఎంకే నాయకత్వ లోపంతో సతమతం అవుతోంది. ఈ పరిస్థితుల్లో విజయ్‌ పార్టీ పెడితే అన్నాడీఎంకే శ్రేణులు కొత్త పార్టీలో చేరే అవకాశం ఉంది" అని అన్నారు.

అంటే.. పీకే ఇప్పుడు విజ‌య్ పార్టీకి వ్యూహాలు అందిస్తే.. ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా.. డీఎంకే పార్టీకి ఇబ్బందు లు త‌లెత్తడం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి పీకే చేస్తోంది న్యాయ‌మేనా? నిన్న‌గాక మొన్న వంద‌ల కోట్లు తీసుకుని.. పార్టీకి వ్యూహాలు అందించిన పెద్ద‌మ‌నిషి.. ఇప్పుడు అదే పార్టీకి వెన్ను పోటు పొడిచేలా ప్ర‌త్య‌ర్థి పార్టీ వైపు ఎలా మొగ్గు చూపుతార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందే పార్టీ పెట్టి బరిలోకి దిగితే కనీసం 10 శాతం ఓట్లు సాధించి డీఎంకే, అన్నాడీఎంకే తరువాత మూడో అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చున‌ని విజ‌య్ భావిస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ పార్టీ నాయకత్వంలో మెగా కూటమి ఏర్పాటు చేసుకుని అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు కూడా అనే సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్రశాంత్‌ కిషోర్‌ను విజయ్‌ కలుసుకున్నారు. మ‌రోవైపు... క్రియాశీలక రాజకీయాల్లోకి విజయ్‌ వస్తున్నట్లు ఉదయనిధి అనుచరవర్గం, డీఎంకే ఆందోళన చెందుతోందని తాము భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే పీకే వ్యూహాల‌పైఅన్ని వ‌ర్గాల నుంచి కూడా విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.