Begin typing your search above and press return to search.

కోటి యజ్ఞం.. హరిత భాగ్యనగరం దిశగా అడుగులు!

By:  Tupaki Desk   |   27 Dec 2021 12:30 AM GMT
కోటి యజ్ఞం.. హరిత భాగ్యనగరం దిశగా అడుగులు!
X
భాగ్యనరగంలో వాహనాల రద్దీ గురించి చెప్పనక్కర్లేదు. వాటివల్ల కలిగే వాయు కాలుష్యం అంతకుమించే ఉంటుంది. ఇకపోతే అంతకంతకూ సిటీ విస్తరిస్తోంది. నగరశివార్లలోని భూముల్లో గేటెడ్ కమ్యూనిటీలు, అపార్టుమెంట్ల రూపంలో ఇళ్లు పెరుగుతున్నాయి. క్రమంగా చెట్లు తగ్గుతున్నాయి. అయితే కాలుష్య భూతం రాజధానిని చుట్టుముడుతోంది. అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ ఎంసీ అప్రమత్తమైంది. హైదరాబాద్ నగరాన్ని హరితమయంగా మార్చేందుకు కృషి చేస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంతో ఆకుపచ్చని భాగ్యనగరాన్ని రూపొందించాలని మహానగర పురపాలక సంస్థ నిర్ణయించింది. ఏటా హరితహారంలో భాగంగా కోట్ల మొక్కలు నాటుతున్నారు. కాగా వచ్చే ఏడాది కోసం జీహెచ్ ఎంసీ ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. నగరంలో దాదాపు కోటి 20 లక్షల మొక్కలు నాటాలని సంకల్పించింది. నగరం చూట్టూ ఈ మొక్కలు నాటాలని భావిస్తోంది. ఆ దిశగా ఏర్పాట్లు చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. దేశ రాజధాని దిల్లీలో ఏర్పడిన వాతావరణ పరిస్థితులు... శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న హరితహారం కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. రాష్ట్రంలోని అడవుల శాతం క్రమంగా పెరుగుతోంది. కాగా గ్రీనరీ పెంచడానికి ఉపయోగపడే మూడో అతిపెద్ద ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. దీని ప్రోత్సాహంతో హరిత భాగ్యనగరంగా తీర్చిదిద్దడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాజధానిలోని ఆక్సిజన్ స్థాయిలు పెంచాలని జీహెచ్ ఎంసీ ఎంసీ ఎప్పటినుంచో ప్లాన్ చేస్తూనే ఉంది.

రాబోయే ఏడాది అనగా 2022 హరితహారంలో భాగంలో కేవలం హైదరాబాద్ లోనే 120 లక్షల మొక్కలు నాటాలని సంకల్పించింది. నగరంలోని రహదారులు, కాలనీలు ఇలా అన్ని ప్రాంతాల్లోనూ మొక్కలు నాటనున్నారు. నగరవాసులకు సురక్షితమైన గాలి... మంచి వాతావరణాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కోటి యజ్ఞాన్ని ప్రారంభించనున్నట్లు జీహెచ్ ఎంసీ అధికారులు చెబుతున్నారు. హరిత భాగ్యనగరం ప్రయత్నంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. కాగా కోటిపైగా మొక్కలతో భాగ్యనగరంలో గ్రీనరీ మరింతగా పెంచవచ్చునని చెబుతున్నారు.