Begin typing your search above and press return to search.

ఒక్క ఈటల కోసం ఇంత భారీ ప్లానింగేంది సారూ?

By:  Tupaki Desk   |   19 May 2021 11:30 AM GMT
ఒక్క ఈటల కోసం ఇంత భారీ ప్లానింగేంది సారూ?
X
తాను ఎవరినైనా టార్గెట్ చేస్తే.. చివరికంటా వారి సంగతి చూసే వరకు నిద్రపోని తత్త్వం గులాబా బాస్ సొంతం. తనకు నచ్చని వారిని పార్టీ నుంచి పంపే విషయంలో ఇప్పటివరకు తిరుగులేని ట్రాక్ రికార్డు ఉన్న కేసీఆర్.. తాజాగా ఈటలను టార్గెట్ చేయటం తెలిసిందే. గతంలో ఎప్పుడూ ఏ నేతను పార్టీ నుంచి బయటకు పంపేటప్పుడు.. వారి పేరు ప్రఖ్యాతులు పెద్దగా లేకపోవటం.. వారిని టార్గెట్ చేసిన తర్వాత ఇష్యూ ఇప్పటిమాదిరి ఇన్ని రోజులు నలగలేదు. ఇప్పటికే ఈటల బాధ్యతను మంత్రి గంగుల ప్రభాకర్ అప్పజెప్పటం.. డైలీ బేసిస్ లో టార్గెట్ చేస్తూ వాతావరణం హాట్ హాట్ గా మారేలా చేస్తున్నారు.

గంగుల చేస్తున్న విమర్శలు.. ఆరోపణలకు ఈటల రియాక్టు అవుతున్నారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. ఎంతలా ప్రయత్నించినా.. నియోజకవర్గంపై ఈటలకున్న పట్టును తగ్గించే విషయంలో గులాబీ బాస్ అంచనాలకు గంగుల రీచ్ కావటం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఈటల మీద మరింత ఒత్తిడి పెంచటంతో పాటు.. ఆయన అనుకూల వర్గాన్ని నయానా.. భయానా దారికి తెచ్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే అనుకూల.. వ్యతిరేక వర్గాలుగా చీల్చగలిగినప్పటికి.. అదేమీ అనుకున్నంత స్థాయిలో మాత్రం సాగటం లేదు. ఇప్పుడున్న వేగం సీఎం కేసీఆర్ కు అస్సలు నచ్చటం లేదంటున్నారు. ఒకసారి నో అన్న తర్వాత నో అన్నట్లు ఉండాలే కానీ.. ఇన్ని రోజులు నానబెట్టటంపై గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంతోనే.. తాజాగా ఈటల వ్యవహారాల్ని చూసేందుకు మరో ఇద్దరికి బాధ్యతలు అప్పజెప్పినట్లుగా చెబుతున్నారు.

ఇలా బాధ్యతలు అప్పజెప్పిన వారిద్దరూ ఈటలకు సన్నిహితులే కాదు.. చాలాకాలంగా భుజం భుజం రాసుకుపూసుకు తిరిగిన వారు కావటం గమనార్హం. పార్టీకి ట్రబుల్ షూటర్ గా.. కష్టం వచ్చినంతనే బాధ్యత అప్పగించే మంత్రి కమ్ మేనల్లుడు హరీశ్ రావు ఒకరైతే.. మరొకరు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్ లకు ఈటల సంగతి చూసుకోవాల్సిందిగా చెప్పినట్లు తెలుస్తోంది.వీరితో పాటు మరో నలుగురు నేతలకు కూడా ఈటల బలాన్ని తగ్గించే కార్యక్రమాన్ని చూసుకోవాలని చెప్పారట. వీరంతా ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ లోని మండలాలు.. మున్సిపాలిటీల్లోని కేడర్ ను తమ వైపు తిప్పుకోవటమే లక్ష్యంగా పని చేస్తారట. ఏమైనా.. ఈటల లాంటి ఒక్క నేతను కంట్రోల్ చేయటానికి.. ఆయనకున్న అధిక్యతను తగ్గించేందుకు ఇంత భారీగా ప్లాన్ చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.