Begin typing your search above and press return to search.

కర్ణాటక సర్కారుపై వ్యాపారులు గుర్రు

By:  Tupaki Desk   |   28 March 2016 12:24 PM GMT
కర్ణాటక సర్కారుపై వ్యాపారులు గుర్రు
X
పర్యావరణం మీద రోజురోజుకీ అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో.. వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్లాస్టిక్ వినియోగంపై ప్రజల్లో చైతన్యం పెరగటమే కాదు.. వీలైనంతవరకూ వాటిని వినియోగించకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి. అయితే.. మారిన జీవనశైలి కారణంగా ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా ఆపలేని దుస్థితి. ఇదిలా ఉంటే.. ప్లాస్టిక్ వినియోగంపై స్వీయ కట్టడి చేసుకుంటున్న వేళ.. ప్రభుత్వాలు సైతం కఠిన నిబంధనల్ని అమలు చేస్తున్నాయి. అయితే.. ఇలాంటి రూల్స్ మీద కర్ణాటక వ్యాపారులకు కోపం వచ్చేసింది.

ప్లాస్టిక్ సంచుల వినియోగం మీద కర్ణాటక సర్కారు విధించిన ఆంక్షలపై వ్యాపారులు మూకుమ్మడిగా కోర్టుకు వెళ్లారు. మార్చి 11 నుంచి 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ ను వాడకూడదంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకవేళ.. ఆ నిబంధనను ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు విధిస్తోంది. కర్ణాటక సర్కారు తాజాగా తీసుకున్న నిర్ణయం కారణంగా.. రెస్టారెంట్.. హోటళ్ల వ్యాపారం తీవ్ర ప్రభావానికి గురి అవుతోందని అక్కడి వ్యాపారులు వాపోతున్నారు.

హోటళ్లలో పార్శిల్ విభాగం తాజా నిబంధనతో తీవ్ర ప్రభావానికి గురి అవుతుంది.. ప్రభుత్వం విధించిన ఆంక్షల్ని పరిశీలించాలని కర్ణాటక వ్యాపారులు కోరుతున్నారు. పర్యావరణం విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని సానుకూలంగా చూడాలే తప్ప.. నెగిటివ్ కోణంలో చూడకూడదన్న అభిప్రాయం పలువురి నోట వినిపిస్తోంది. లాభాలే తప్ప వ్యాపారులకు పర్యావరణం పట్టదా? అన్న ప్రశ్నను పలువురు పర్యావరణ వేత్తలు వేస్తున్నారు. మరి.. ఇలాంటి ప్రశ్నలు కర్ణాటక వ్యాపారులకు వినిపిస్తున్నట్లు లేదే? మరి.. వ్యాపారుల వాదనపై కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో..?