Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో ప్లాస్టిక్ మిల్క్ .. కలకలం

By:  Tupaki Desk   |   11 Oct 2019 12:09 PM GMT
హైదరాబాద్ లో ప్లాస్టిక్ మిల్క్ .. కలకలం
X
కాదేది కల్తీకి అనర్హం అన్నారు పెద్దలు.. కల్తీ లేనిదే ఇప్పుడు ఏ ఆహార పదార్థం మార్కెట్లో దొరకడం లేదు. అందుకే ఈ కల్తీ తిండి తిని ముప్పై ఏళ్లకే అన్ని రోగాలు మనకు వచ్చిపడుతున్నాయి.

ఉదయం తాగే పాల నుంచి రాత్రి పడుకునేదాకా మన తినే తిండి మొత్తం కల్తీ చేస్తున్నారు కొందరు అక్రమార్కులు. పిల్లలు, పెద్దలకు పౌష్టికాహారం, నిత్య అవసరం అయిన పాలను వదలడం లేదు నీచులు. కల్తీ చేసి వారి ప్రాణాలతో కొందరు అక్రమార్కులు చెలగాటం ఆడుతున్నారు.

తాజాగా హైదరాబాద్ లో పాలుకొన్న ఓ వ్యక్తి తాగడం కోసం వేడి చేయగా.. ఆ పాలు ప్లాస్టిక్ రూపంలోకి మారిపోవడంతో షాక్ అయ్యాడు. హైదరాబాద్ లోని ప్రగతి నగర్ లో ఈ దారుణం వెలుగుచూసింది. దీంతో హైదరాబాద్ లో కల్తీ పాలు అమ్ముతున్నారనే విషయం బయటపడింది.

ప్రగతి నగర్ లోని సాయితేజ మిల్క్ సెంటర్ లో రోజులాగే రెండు పాల ప్యాకెట్లను పవన్ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు.. గిన్నెలో పోసి వేడి చేయగా పాలు ఐదు నిమిషాలకే ప్లాస్టిక్ గా మారిపోయాయి. మరో పాల ప్యాకెట్ ను తెచ్చి మరో గిన్నెలో పోసి వేడి చేసినా ఇదే పరిస్థితి. దీంతో ప్లాస్టిక్ గా మారిపోయిన పాలపై నిర్వాహకుడిని ప్రశ్నించారు. అతడు దురుసుగా సమాధానం ఇవ్వడంతో ఈ ప్లాస్టిక్ పాలపై పవన్ అనే బాధితుడు తాజాగా బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ కల్తీ పాలను సేకరించిన పోలీసులు ల్యాబ్ కు పంపారు. ఈ పాలు తాగితే క్యాన్సర్ - బీపీ - గుండె వ్యాధుల - కిడ్నీలు దెబ్బతింటాయని.. మెదడు, కాలేయం, మూత్రపిండాలు పాడు అవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులు - గర్భిణులకు చాలా డేంజర్ అని చెబుతున్నారు. కల్తీపాలను కనుగొనేందుకు మెడికల్ షాపులో దొరికే టింకచ్చర్ అయోడిన్ ను పాలలో వేస్తే పసుపు రంగులోకి పాలు మారితే మంచిపాలు అని.. నీలం రంగులోకి మారితే కల్తీ పాలుగా గుర్తించాలని వైద్యులు చెబుతున్నారు.

హైదరాబాద్ లో ఇలా కల్తీ ప్లాస్టిక్ పాలు బయటపడడంతో నగరవాసులు హడలిచస్తున్నారు. పాలు తాగాలంటేనే భయపడే పరిస్థితి దాపురించింది.