Begin typing your search above and press return to search.

జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం!

By:  Tupaki Desk   |   29 Jun 2022 12:30 PM GMT
జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం!
X
ఒక్కసారి ప్లాస్టిక్ భూమిలో చేరితే అది కరగడం కష్టం. దాని వల్ల వెలువడే విషవాయువులు భూసారాన్ని పీల్చేయడమే కాదు.. మనుషుల ప్రాణాలు తీస్తాయి. అందుకే ప్లాస్టిక్ వాడకం కట్టడి కంటే మొత్తానికే నివారించడం బెటర్ అనే నిర్ధారణకు వచ్చింది కేంద్ర సర్కార్. అందుకే జులై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఒకసారి వాడి పారేసే)పై నిషేధం విధించింది.

ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ వస్తువులపై దేశవ్యాప్తంగా జులై 1 నుంచి నిషేధం అమలులోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు సంబంధించి పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నోటీఫై చేసింది. ముఖ్యంగా తక్కువ పరిమాణం కలిగిన ఒకేసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ వస్తువులను తయారు చేయడం, దిగుమతి చేసుకోవడం, నిల్వ ఉంచుకోవడం, సరఫరా, అమ్మకంతోపాటు వినియోగాన్ని కూడా పూర్తిగా నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి నిషేధిత జాబితాలో ఏయే వస్తువులు ఉన్నాయో తెలియజేస్తూ తాజాగా ప్రకటన జారీ చేసింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఒకేసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ను నిషేధాన్ని అమలులోకి తెస్తున్నట్లు పర్యావరణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. పెట్రో కెమికల్‌ సంస్థలు కూడా ప్లాస్టిక్‌ ముడిసరకును వస్తువులను తయారుచేసే పరిశ్రమలకు సరఫరా చేయవద్దని ఉత్తర్వులు జారీ చేసింది.

ఏ వాణిజ్య సంస్థా తమ పరిధిలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ ఉపయోగించరాదని షరతు విధిస్తూ స్థానిక సంస్థలు లైసెన్సులు జారీచేయాలని, ఒకవేళ ఎవరైనా ఉపయోగించినా, లేదంటే నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులు విక్రయించినా వాటి లైసెన్సులు రద్దు చేయాలని స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. జులై 1 నుంచి మొదలయ్యే నిషేధాన్ని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యవేక్షించనుంది. ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు సీపీసీబీకి నేరుగా రిపోర్ట్ చేయనున్నాయి. ఇకపై నిషేధిత వస్తువులు తయారుచేసే ఏ పరిశ్రమకు పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ ముడి సరకులు సరఫరా చెయ్యవు.

గత వారంలోనే భూమిలో కలిసిపోయే ప్లాస్టిక్‌ వస్తువుల తయారు చేసే మొత్తం 200 పరిశ్రమలకు సీపీసీబీ.. వన్ టైం సర్టిఫికేట్ల ను జారీ చేసింది. కేంద్రం విధించిన నిషేధాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే 1986 ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 5 ఏళ్ల జైలు లేదా లక్ష రూపాయల వరకు జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంది. అంతేకాదు వాటితో పాటు స్థానిక ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో మున్సిపల్ చట్టాల ప్రకారం కూడా జరిమానాలు విధించవచ్చు.

నిషేధిత జాబితాలో ఉన్న వస్తువులు

* ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, స్పూన్‌లు, కప్‌లు, స్ట్రాలు, ఫోర్క్‌లు

* స్వీట్ బాక్స్‌లు, ఫుడ్ ప్యాకింగ్‌లో వాడే ప్లాస్టిక్ కవర్లు

* ప్లాస్టిక్ పుల్లలతో ఉండే ఇయర్ బడ్స్

* బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్

* ప్లాస్టిక్ జెండాలు

* లాలీపాప్, చాక్లెట్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్

* ఐస్ క్రీమ్ పుల్లలు

* థర్మాకోల్

* 100 మైక్రాన్ల లోపు మందం గల పీవీసీ బ్యానర్లు

* ప్లాస్టిక్ ఇన్విటేషన్ కార్డులు