Begin typing your search above and press return to search.

సంచ‌ల‌నం: రాఫెల్ పేప‌ర్స్ చోరీ!

By:  Tupaki Desk   |   6 March 2019 11:04 AM GMT
సంచ‌ల‌నం:  రాఫెల్ పేప‌ర్స్ చోరీ!
X
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం మోడీ ప్ర‌భుత్వం మీద మ‌చ్చ వేసింది. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన‌ప్ప‌టికీ.. ఈ ఇష్యూపై విప‌క్షాలు సంధిస్తున్న స‌వాళ్ల‌కు స‌మాధానాలు చెప్ప‌లేని ప‌రిస్థితుల్లో క‌మ‌ల‌నాథులు ఉన్న‌ట్లుగా ఆ పార్టీ నేత‌ల మాట‌లు ఉన్నాయి. విప‌క్షాలు సంధిస్తున్న ప్ర‌శ్న‌ల‌కు బీజేపీ నేత‌లు స‌మాధానం చెప్ప‌క‌పోవటం.. యూపీఏ స‌ర్కారుతో పోలిస్తే.. త‌మ ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందం బ్ర‌హ్మండ‌మైన‌ద‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నా.. ఒక్కో రాఫెల్ యుద్ధ విమానాన్ని ఎంత‌కు కొంటున్నార‌న్న సూటి ప్ర‌శ్న‌కు.. ర‌హ‌స్య‌మని ప్ర‌క‌టించ‌టంపై ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒక కీల‌క అంశాన్ని కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున అటార్నీ జ‌న‌ర‌ల్ కేకే వేణుగోపాల్ చేసిన వ్యాఖ్య‌లు షాకింగ్ గా మారాయి. యుద్ధ విమానాల‌కు చెందిన కీల‌క ప‌త్రాలు దొంగ‌త‌నానికి గురైన‌ట్లు ఆయ‌న చెబుతున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పంద విష‌యంలో దాఖ‌లైన రివ్యూ పిటిష‌న్ల‌పై అత్యున్న‌త న్యాయ‌స్థానం తాజాగా విచార‌ణ జ‌రిపింది.

సుప్రీంకోర్టులో వాద‌న‌లు జ‌రుగుతున్న వేళ‌.. సీనియ‌ర్ న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌న్ ఒక నోట్ లో ఉన్న వివ‌రాల్ని చ‌దువుతున్నారు. ఆ సంద‌ర్భంగా అటార్నీజ‌న‌ర‌ల్ వేణుగోపాల్ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ.. ప్ర‌శాంత భూష‌ణ్ ప్ర‌స్తావిస్తున్న డాక్యుమెంట్లు ర‌క్ష‌ణ శాఖ నుంచి చోరీకి గురైన‌ట్లుగా చెప్పారు.

ర‌క్ష‌ణ శాఖ‌లో ప్ర‌స్తుతం ప‌ని చేస్తున్న ఉద్యోగులు కానీ.. మాజీ ఉద్యోగులు కానీ ప‌త్రాల్ని దొంగ‌త‌నం చేసి ఉండొచ్చ‌న్నారు. ఈ అంశంపై ఇప్ప‌టికే ద‌ర్యాప్తున‌కు ఆదేశించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ర‌క్ష‌ణ కొనుగోళ్ల వ్య‌వ‌హారం ఎంత సున్నిత‌మైన‌దో ఇటీవ‌ల ఘ‌ట‌న‌లు చెబుతున్నాయ‌ని.. వీటిని స్క్రూట్నీ చేయ‌టంతో భ‌విష్య‌త్ కొనుగోళ్ల మీద ప్ర‌భావం ప‌డొచ్చ‌న్న అభిప్రాయాన్ని వేణుగోపాల్ వ్య‌క్తం చేశారు. మ‌రి..కీల‌క ప‌త్రాలు చోరీకి గురైన విష‌యంపై సుప్రీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.