Begin typing your search above and press return to search.

రామానుజుడు జ్ఞానానికి ప్ర‌తీక : ప్ర‌ధాని

By:  Tupaki Desk   |   6 Feb 2022 2:30 AM GMT
రామానుజుడు జ్ఞానానికి ప్ర‌తీక : ప్ర‌ధాని
X
భ‌క్తి మార్గం ధ్యాన మార్గం స‌మ్మిళిత రూపం శ్రీ‌రామానుజాచార్యులు అన్న‌ది ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చెబుతున్న మాట. ముచ్చింత‌ల్ లో శ్రీ‌రామానుజాచార్యుల విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించాక మోడీ ప్ర‌సంగించి, స‌భికులను ఆక‌ట్టుకున్నారు. వైదిక కాండ‌ల్లో పాల్గొని చిన‌జియ‌రు స్వామీజీ ఆశీస్సుల‌తో పాటు ఇత‌ర రుత్విజుల వేదాశీర్వ‌చ‌నాలూ అందుకున్నారు.

వ‌సంత పంచ‌మి వేళ‌ల్లో ఓ క్ర‌తువు.. జ్ఞానానికీ భ‌క్తికీ అనుసంధానిస్తూ జ‌రుగుతున్న క్ర‌తువు..తెలంగాణ దారుల్లో విశిష్ట క్ర‌తువు..చినజియ‌రు స్వామీజీ ఆశ్ర‌మాన..భ‌క్తి మార్గం జ్ఞాన మార్గం ఉప‌దేశించిన విశిష్ట మూర్తి, ఆధ్యాత్మిక దీప్తి శ్రీ రామానుజాచార్యుల విగ్ర‌హాన్ని జాతికి అంకితం చేసి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అత్యంత భావోద్వేగంతో మాట్లాడారు. విగ్ర‌హ విశిష్ట‌త‌నే కాదు భార‌తీయ ధ‌ర్మంలో ఉన్న స‌నాత‌నత,భ‌క్తిమార్గంలో ఉన్న గొప్ప‌ద‌నం అన్నింటినీ వివ‌రించారు.

ఇక్క‌డ వెలసిన‌108 దివ్య క్షేత్రాల‌ను ద‌ర్శించి, త‌ద‌నంతర వైదిక కాండల్లో ఆయ‌న పాల్గొన్నారు. చిన జియ‌రు స్వామీజీ ఆయ‌న‌తో విష్వ‌క్సేనేష్ఠి యాగం చేయించారు.గురువు వ‌ల్లే జ్ఞానం విక‌సిస్తుంద‌ని అన్నారు. ఈ విగ్ర‌హం స్ఫూర్తి మాత్ర‌మే కాదు స‌నాత‌న వైభవానికి ప్ర‌తీక అని కొనియాడారు.విశ్వ మానవ క‌ల్యాణానికి ఈ ప్రాంగ‌ణం ప్ర‌తీక గా నిలుస్తుంద‌న్న అర్థంతో మోడీ త‌న ప్ర‌సంగం వినిపించారు.ప్రపంచ స్థాయి ప‌ర్యాట‌క కేంద్రంగా ఈ క్షేత్రం విల‌సిల్లుతుంద‌ని కీర్తిస్తూ, ఇక్క‌డి వారి కృషిని అభినందించారు.

మోడీ ప్ర‌సంగంలో మ‌నిషికి జాతి కాదు గుణం ముఖ్యం అని చాటిన రామానుజ త‌త్వం ప్ర‌స్తావ‌నకు నోచుకుంది.ఆద్యంతం భార‌తీయ విశిష్ట‌త‌ను,స‌నాత‌న ధ‌ర్మ సారాన్నీ వివ‌రించేందుకు, వినిపించేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నించారు.జ‌గ‌ద్గురు రామానుజా చార్యుల స‌మానత్వ సూత్రం అంబేద్క‌ర్ రాజ్యాంగానికి స్ఫూర్తి అని కూడా అన్నారు. ప్ర‌సంగంలో స‌ర్దార్ ప‌టేల్ ప్ర‌స్తావ‌న తెచ్చి ఆ విగ్ర‌హం ఐక్య‌త‌కు ఈ విగ్ర‌హం స‌మాన‌త‌కు ప్ర‌తీక‌గా ఉంటాయి అని పోలిక చెబుతూ, ఇక్క‌డి ప్రాంగణాన్నీ, ఆశ్ర‌మ నిర్వ‌హ‌ణ‌ను కొనియాడారు.