Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ను ఓ రేంజ్లో ఏసుకున్న మోడీ!

By:  Tupaki Desk   |   26 Jun 2018 11:11 AM GMT
కాంగ్రెస్ ను ఓ రేంజ్లో ఏసుకున్న మోడీ!
X
అందుకే అంటారు మంచి ప‌ని చేయ‌కున్నా ఫ‌ర్లేదు.. చెడు ప‌ని మాత్రం చేయ‌కు అని. తాత్కాలిక అధికారం కోసం అప్పుడెప్పుడో ఇందిర‌మ్మ ప‌డిన ఎమ‌ర్జెన్సీ క‌క్కుర్తి కాంగ్రెస్‌ కు శాపంగా మారింది. నిజానికి అత్య‌యిక ప‌రిస్థితిని విధించిన ఇందిర‌మ్మ‌కు దేశ ప్ర‌జ‌లు చేయాల్సిన శాస్తి ఎప్పుడో చేసేశారు. ప్ర‌జాస్వామ్యానికి.. త‌మ వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌కు దెబ్బ తీసేలా వ్య‌వ‌హ‌రించే వారు ఎవ‌రైనా.. ఎంత‌టి నాయ‌కులైనా వారికి ఎలాంటి గుణ‌పాఠం చెప్పాలో చెప్పేసింది భార‌తావ‌ని.

చేసిన త‌ప్పును ఎఫెక్టివ్ గా ఎత్తి చూపే వారు లేకుంటే ఎలా ఉంటుంద‌న్న దానిపై కాంగ్రెస్ ఇప్ప‌టివ‌ర‌కూ ఆలోచించి ఉండ‌క‌పోవ‌చ్చు కానీ.. మోడీ పుణ్య‌మా అని మాత్రం ఆలోచించ‌టం ఖాయం. ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీకి భారీ శిక్ష వేసిన త‌ర్వాత కూడా.. గ‌తంలో వారు చేసిన త‌ప్పును ఎత్తి చూపిస్తూ నిప్పులు చెర‌గ‌టం.. కాంగ్రెస్ నేత‌ల గొంతుల్లో నుంచి మాట రాకుండా చేయ‌టం మాట‌ల జాదూ మోడీకే చెల్లింద‌ని చెప్పాలి.

ఓప‌క్క త‌న తీరుతో దేశ ప్ర‌జ‌లు విసిగిపోయిన వైనాన్ని ఓట్ల‌తో చెబుతున్న వేళ‌.. ముంద‌స్తుకు వెళ్లాల‌న్న తెగ ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న ప్ర‌ధాని మోడీ.. కాంగ్రెస్ పార్టీకి పాలించే అధికారం లేద‌న్న విష‌యాన్ని ఒక్క ఉదాహ‌ర‌ణ‌తో తేల్చి చెప్పేస్తున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.అప్పుడెప్పుడో ఇందిర‌మ్మ జ‌మానాలో జ‌రిగిన చారిత్ర‌క త‌ప్పును తాజాగా ఎత్తి చూపిన మోడీ.. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.

ఇటీవ‌ల కాలంలో త‌న‌పై విరుచుకుప‌డుతున్న కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి స‌రైన కౌంట‌ర్ ఇచ్చేందుకు వీలుగా ఆయ‌న 1975 నాటి అత్య‌యిక ప‌రిస్థితిని తెర మీద‌కు తీసుకొచ్చారు. 1975లో కాంగ్రెస్ పార్టీ ఎమ‌ర్జెన్సీ విధించిన‌ప్పుడు ఏం జ‌రిగిందో నేటి యువ‌త తెలుసుకోవాల‌నుకున్నార‌ని.. కేవ‌లం కొద్దిమంది ప్ర‌యోజ‌నాల కోస‌మే గాంధీ కుటుంబం నాడు ఎమ‌ర్జెన్సీని విధించిందంటూ ఫైర్ అయ్యారు.

ఇందిర‌మ్మ విధించిన ఎమ‌ర్జెన్సీకి 43 ఏళ్లు నిండిన సంద‌ర్భంగా ముంబ‌యిలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించిన ప్రధాని మోడీ రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ పైనా.. గాంధీ కుటుంబం పైనా విరుచుకుప‌డ్డారు. ప‌వ‌ర్లో ఉండాల‌న్న దురాశ కార‌ణంగా ప్ర‌జాస్వామ్యాన్ని బ‌లి చేశార‌ని.. ప్ర‌జ‌ల్లో ఎంతో గౌర‌వం ఉన్న రాజ‌కీయ నేత‌ల్ని సైతం జైల్లో పెట్టార‌న్నారు.

ఒక్క గాంధీ కుటుంబం ల‌బ్థి పొంద‌టం కోస‌మే ఇదంతా చేశార‌న్న మోడీ.. న్యాయ‌వ్య‌వ‌స్థ గొంతు నొక్కార‌ని.. అభిశంస‌న తీర్మానాన్ని కూడా తీసుకొచ్చార‌న్నారు. ఎవ‌రైనా ఎదురుతిరిగితే వాళ్ల‌కు జైలేగ‌తి అన్న ప‌రిస్థితి తీసుకొచ్చార‌న్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీలు మ‌ళ్లీ ఎమ‌ర్జెన్సీ నాటి రోజులు తీసుకురాకుండా దేశ ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని చెప్ప‌టం ద్వారా కాంగ్రెస్ ను ఎంత దూరంగా ఉంచాలో చెప్ప‌క‌నే చెప్పేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎమ‌ర్జెన్సీ సంద‌ర్భంగా దేశంలో ఏం జ‌రిగిందో నేటి యువ‌త తెలుసుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లుగా చెప్పిన మోడీ.. ఎమ‌ర్జెన్సీపై కాంగ్రెస్‌ ను విమ‌ర్శించేందుకు తాము బ్లాక్ డే జ‌రుపుకోవ‌టం లేదు కానీ ప్ర‌జ‌లంద‌రికి వారు చేసిన ప‌ని తెలియాలంటూ విరుచుకుప‌డ్డారు. త‌మ ఉనికి ప్ర‌మాదంలో ప‌డింద‌ని గాంధీ కుటుంబం ఎప్పుడు భ‌య‌ప‌డినా.. దేశంలో భ‌యాందోళ‌న‌లు నెల‌కొంద‌నీ.. దేశం సంక్షోభంలో ప‌డింద‌ని కేక‌లు వేస్తుంద‌న్నారు.

పార్టీలోనే అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం లేన‌ప్పుడు.. ప్ర‌జాస్వామ్య విలువ‌ల గురించి మాట్లాడే అర్హ‌త ఎక్క‌డ ఉంటుంద‌ని ప్ర‌శ్నించిన మోడీ.. ప్ర‌జాస్వామ్య విలువ‌ల గురించి మాట్లాడే అర్హ‌త వారికి లేద‌న్నారు. మొత్తానికి త‌న‌పై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్న కాంగ్రెస్ అధ్య‌క్షుడికి దిమ్మ తిరిగేలా ఎమ‌ర్జెన్సీ పేరుతో మోడీ ఓ రేంజ్లో వేసుకోవ‌టం గ‌మ‌నార్హం. ఇన్ని నీతులు చెప్పిన మోడీ మాష్టారు.. తమ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కొన్ని వ్య‌వ‌స్థ‌ల్ని ప్ర‌యోగించి సోదాలు చేయించ‌టం.. కేసులు పెట్టించ‌టం లాంటివి త‌న హ‌యాంలో జ‌రుగుతున్నాయ‌న్న విష‌యాన్ని ఎంత ముచ్చ‌ట‌గా దాచి పెట్టి.. నీతులు వ‌ల్లిస్తున్న వైనం చూస్తే.. మోడీ అంటే ఏమిటో ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మోడీనా మ‌జాకానా!