Begin typing your search above and press return to search.

గ్రాఫ్ ప‌డిపోతున్న మోడీకి అంత‌ర్జాతీయ పుర‌స్కారం!

By:  Tupaki Desk   |   25 Oct 2018 4:49 AM GMT
గ్రాఫ్ ప‌డిపోతున్న మోడీకి అంత‌ర్జాతీయ పుర‌స్కారం!
X
మంగ‌ళ‌వారం ఆస‌క్తిక‌ర ప‌రిణామం ఒకటి చోటు చేసుకుంది. అంత‌ర్జాతీయంగా పేరు ప్ర‌ఖ్యాతులున్న శాంతి పుర‌స్కారం భారత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని వ‌రించింది. దీని ప్ర‌త్యేక‌త ఏమంటే.. ఇప్ప‌టివ‌ర‌కూ దేశానికి ప్ర‌ధానులైన ఏ ఒక్క నేత‌కు ఈ త‌ర‌హా పుర‌స్కారం ల‌భించ‌కపోవ‌టం. మొట్ట‌మొద‌టిసారిగా ఈ అంత‌ర్జాతీయ శాంతి పుర‌స్కారానికి మోడీ ఎంపికైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నారు.

ఇంత‌కీ మోడీని వ‌రించిన అంత‌ర్జాతీయ పుర‌స్కారం ఏమంటే.. ప్ర‌తిష్ఠాత్మ‌క సియోల్ శాంతి పుర‌స్కారం. ఈ విష‌యాన్ని విదేశీ వ్య‌వ‌హారాల శాఖ అధికార ప్ర‌తినిధి ర‌వీశ్ కుమార్ తాజాగా ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. సీబీఐలో లొల్లి ముచ్చ‌ట‌ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న త‌రుణంలో మోడీకి అంత‌ర్జాతీయ పుర‌స్కారం ల‌భించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

విశేషం ఏమంటే.. ఇటీవ‌ల కాలంలో మోడీ గ్రాఫ్ అంత‌కంత‌కూ ప‌డిపోతోంది. రాఫెల్ కుంభ‌కోణం పేరుతో సాగుతున్న ప్ర‌చారంతో ఆయ‌న ఇమేజ్ దారుణంగా దెబ్బ తింది. త‌న‌ను తాను చౌకీదార్ (కాప‌లాదారు)గా అభివ‌ర్ణించుకునే మోడీని ఉద్దేశించి.. చౌకీదార్ న‌హీ చోర్ హై అంటూ కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్‌తో స‌హా ప‌లువురు విప‌క్ష నేత‌ల‌తో పాటు.. సాధార‌ణ ప్ర‌జ‌లు సైతం విరుచుకుప‌డుతున్న వేళ‌.. అందుకు భిన్నంగా మోడీకి అంత‌ర్జాతీయ పుర‌స్కారం ప్ర‌ధానిని వ‌రించ‌టం గ‌మ‌నార్హం.

దేశ ఆర్థిక అభివృద్ధికి బాట‌లు వేసినందుకే మోడీకి ఈ పుర‌స్కారం ల‌భించిన‌ట్లుగా అవార్డు క‌మిటీ తెలిపిన‌ట్లు చెబుతున్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో.. మాన‌వాభివృద్ధిలో..అంత‌ర్జాతీయంగా శాంతి స్థాప‌న‌లో మోడీ కీల‌క‌భూమిక పోషించిన‌ట్లుగా అవార్డుల క‌మిటీ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది.

అంత‌ర్జాతీయ స్థాయిలో శాంతి.. స్నేహ సంబందాలు పెంపొందించ‌టంలో విశేషంగా కృషి చేసిన అధినేత‌ల‌కు ద‌క్షిణ కొరియా ప్ర‌భుత్వం 1990నుంచి ఈ పుర‌స్కారాన్ని ప్ర‌తి ఏటా ప్ర‌క‌టిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాదికి మోడీని ఎంపిక చేశారు. అంత‌ర్జాతీయ పుర‌స్కారం మోడీని వ‌రించ‌టంపై పెద్ద ఎత్తున ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా అభినంద‌న‌లు కురిపిస్తోంది. ఓప‌క్క రాహుల్ చౌకీదార్ న‌హీహై చోర్ హై అంటూ విరుచుకుప‌డుతున్న వేళ వ‌రించిన ఈ అంత‌ర్జాతీయ పుర‌స్కారం మోడీకి మ‌రింత నైతిక స్థైర్యాన్ని అందిస్తుంద‌నటంలో సందేహం లేదు.