Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని మోడీ జ‌న్మ‌దినం.. ఆయ‌న గురించి మీకు తెలియ‌ని టాప్ సీక్రెట్స్ ఇవే!

By:  Tupaki Desk   |   17 Sep 2022 9:30 AM GMT
ప్ర‌ధాని మోడీ జ‌న్మ‌దినం.. ఆయ‌న గురించి మీకు తెలియ‌ని టాప్ సీక్రెట్స్ ఇవే!
X
సెప్టెంబ‌ర్ 17.. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జ‌న్మ‌దినమ‌న్న సంగ‌తి తెలిసిందే. 72వ ప‌డిలోకి చేరుకున్న మోడీ ఒక దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలో పుట్టారు. త‌ల్లిదండ్రుల ఆరుగురు సంతానంలో ఒక‌డిగా జ‌న్మించిన న‌రేంద్ర మోడీ ఇంతై... ఇంతింతై.. వటుడింతై.. అన్న‌ట్టు భార‌త రాజ‌కీయాల్లో ఎదిగారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశ‌మైన భార‌త్‌కు ప్రధాన‌మంత్రి స్థాయికి చేరుకున్నారు. జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీల త‌ర్వాత ఎక్కువ కాలం ప్ర‌ధాని ప‌ద‌విలో ఉన్న నేత‌గా న‌రేంద్ర మోడీ రికార్డు సృష్టించారు. అంతేకాకుండా దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చాక ప్ర‌ధానిగా ఎంపికైన రికార్డు మోడీ పేరిటే ఉంది. ఆయ‌న‌కు ముందు ఉన్న ప్ర‌ధానులంతా దేశానికి స్వాతంత్య్రం రాక ముందు జ‌న్మించిన‌వారే. ప్ర‌పంచంలోనే శ‌క్తివంత‌మైన నేత‌ల్లో ఒక‌రిగా ఉన్న మోడీ గురించి మీకు తెలియ‌ని విశేషాలు ఇవే..

గుజ‌రాత్‌లోని మెహ‌స‌న్ జిల్లా వాద్ న‌గ‌ర్‌లో సెప్టెంబ‌ర్ 17, 1950న న‌రేంద్ర మోడీ.. దామోద‌ర్ దాస్ మోడీ, హీరాబా దంప‌తుల‌కు జ‌న్మించారు. వారి ఆరుగురి సంతానంలో మోడీ మూడోవాడు.

దిగువ మ‌ధ్యత‌ర‌గతి కుటుంబం కావ‌డంతో మోడీ మాతృమూర్తి హిరాబా చుట్టుప‌క్క‌ల ఇళ్ల‌లో ప‌నిచేసేవారు. ఆయ‌న తండ్రి స్థానిక రైల్వేస్టేష‌న్‌లో టీ అమ్మేవారు. ఆయ‌న‌కు స‌హాయం చేయ‌డానికి మోడీ కూడా అక్క‌డికి వెళ్లి టీ అమ్మేవారు. ఇదే విష‌యాన్ని న‌రేంద్ర మోడీ తాను ప్ర‌ధానమంత్రి అయ్యాక ఆ విష‌యాన్ని ఇప్ప‌టికీ గుర్తు చేసుకుంటారు.

కాగా చిన్న‌త‌నంలో న‌రేంద్ర మోడీ భార‌త సైన్యంలో చేరాల‌నే ఆకాంక్ష‌తో ఉండేవారు. గుజ‌రాత్‌లోని జామ్ న‌గ‌ర్ సైనిక స్కూల్‌లో చేరాల‌ని అనుకున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందుల‌తో ఆ క‌ల సాకారం కాలేదు. అయితే త‌న తండ్రికి స‌హాయంగా రైల్వేస్టేష‌న్‌లో టీ అమ్ముతున్న‌ప్పుడు భార‌త్ -పాక్ యుద్ధంలో పాల్గొని స్టేష‌న్‌కు వ‌చ్చిన సైనికులకు టీ అందించి మోడీ చాలా ఆనందించార‌ట‌.

ప‌ద‌మూడేళ్లు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన‌ప్పుడు, గ‌త ఎనిమిదేళ్లు ప్ర‌ధాన‌మంత్రిగా ప‌నిచేస్తున్నా ఆయ‌న విరామ‌మెరుగ‌క ప‌నిచేస్తూనే ఉంటార‌ని ఆయ‌న గురించి తెలిసిన‌వాళ్లు చెబుతుంటారు. ఏ రోజూ ఆయ‌న జ్వ‌రం బారిన కూడా ప‌డ‌లేద‌ట‌. యోగా, ప్రాణాయామాలే ఇందుకు కార‌ణం. ప్ర‌ధాని మోడీ కూడా పలు సంద‌ర్భాల్లో యోగా, ప్రాణాయామం వల్లే తాను ఆరోగ్యంగా, ఉత్తేజంగా ఉండ‌గ‌లుగుతున్నాన‌ని తెలిపారు.

అలాగే ఆయ‌న గుజ‌రాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప‌ద‌మూడేళ్ల కాలంలోనూ, దేశ ప్ర‌ధానిగా ఉన్న ఎనిమిదేళ్ల‌లోనూ ఒక్క రోజు కూడా సెల‌వు పెట్ట‌లేద‌ట‌.

అలాగే హోటళ్ల‌లో ప‌నిచేయ‌డం అంటే మోడీకి ఇష్టం ఉండ‌ద‌ట‌. రాత్రి స‌మ‌యాల‌ను ఆయ‌న ప్రయాణం చేయ‌డానికి వినియోగించుకుంటార‌ట‌. ఒక‌వేళ పొద్దున్నే ఏదైనా కార్య‌క్ర‌మానికి వెళ్లాల్సిన‌ప్పుడు మాత్రం హోట‌ల్‌లోనే బ‌స చేస్తార‌ట‌.

న‌రేంద్ర మోడీ పెద్ద‌ల బ‌ల‌వంతం మీద పెళ్లి చేసుకున్నా ఆ వివాహాన్ని త‌ర్వాత తిర‌స్క‌రించారు. ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ ఉన్న మోడీ దేశ‌దిమ్మ‌రిగా దేశంలో చాలా చోట్ల‌కు ఒంట‌రిగా ప్ర‌యాణించారు. ఎన్నో ఆధ్యాత్మిక యాత్ర‌లు కూడా చేశారు. ప‌శ్చిమ బెంగాల్‌లోని బేలూరు మ‌ఠానికి ఇలాగే చేరుకున్నారు.

ఈ యాత్ర‌ల‌తో ఆయ‌న విద్యాభ్యాసం దెబ్బ‌తింది. అయితే 28 ఏళ్ల వ‌య‌సులో ఢిల్లీ యూనివ‌ర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. అంతేకాకుండా ప‌బ్లిక్ రిలేష‌న్స్ కోర్సు చ‌ద‌వ‌డానికి మూడు నెల‌ల‌పాటు అమెరికాలో కూడా ఉండ‌టం విశేషం.

నిత్యం యోగా చేయ‌డం, శాకాహారం, క‌విత‌లు, ప‌ద్యాలు రాయ‌డం, చ‌ద‌వ‌డం, ఫొటోగ్ర‌ఫీ ఆయ‌న హాబీలు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.