Begin typing your search above and press return to search.

జీ 20 దేశాలకు మోదీ పిలుపు.. పెద్దన్న పాత్రలో భారత్..!

By:  Tupaki Desk   |   15 Nov 2022 7:37 AM GMT
జీ 20 దేశాలకు మోదీ పిలుపు.. పెద్దన్న పాత్రలో భారత్..!
X
ఇండోనేషియా రాజధాని బాలిలో జీ 20 సదస్సు నేటి నుంచి ప్రారంభమైంది. ఈ సదస్సులో జీ 20 దేశాలకు చెందిన ముఖ్య నేతలు పాల్గొని కీలక అంశాలపై చర్చించనున్నారు. జీ 20 సమ్మిట్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సహా ఆయా దేశాధినేతలు హాజరయ్యారు.

జీ 20 సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఇతర దేశాధినేతలకు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఘన స్వాగతం పలికారు. రెండ్రోజులపాటు జరిగే 20 సదస్సులో భాగంగా కరోనా నిర్మూలన.. రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్.. ఐరోపా సంక్షోభం.. ఇంధన భద్రత.. ఆహార భద్రత.. ఆర్థిక మాద్యం తదితర కీలక సమస్యలపై జీ 20 దేశాల నేతలు చర్చిస్తారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీ 20 వేదికగా పలు కీలక అంశాలపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. కరోనా పరిస్థితులు.. రష్యా-ఉక్రెయిన్ వార్.. వాతావరణ పరిస్థితులు.. ఆహార భద్రత.. ఇంధన సమస్యల పరిష్కారానికి పలు సలహాలు.. సూచనలు చేశారు. కరోనా తర్వాత ప్రపంచాన్ని సరికొత్తగా సృష్టించే బాధ్యత జీ 20 దేశాలపై ఉందని స్పష్టం చేశారు.

రెండో ప్రపంచ యుద్ధం కారణంగా నాడు ప్రపంచంలో పెను మార్పులు.. విధ్వసం నెలకొందన్నారు. దీని తర్వాత నాటి ప్రపంచ నేతలు శాంతిని తిరిగి నెలకొల్పేందుకు ఎంతగానో కృషి చేశారని తెలిపారు. ఇప్పుడు మన వంతు వచ్చిందని మోదీ గుర్తు చేశారు. రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో కాల్పుల విరమణ.. దౌత్యపరమైన మార్గాలు తిరిగి నెల్పేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ఇంధన సమస్యలపై ప్రస్తావిస్తూ.. గ్యాస్ కొనుగోళ్లపై పశ్చిమ దేశాలు ఆంక్షలు.. పరిమితులను విధించవద్దని సూచించారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని.. ప్రపంచ ఎనర్జీ మార్కెట్లో స్థిరత్వాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ.. స్వచ్ఛ ఇంధనానికి భారత్ ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుందని మోదీ స్పష్టం చేశారు.

నేడు ప్రపంచం ఆహారం.. ఆర్థిక మాద్యంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుందని వివరించారు. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో ఐక్య రాజ్య సమితి సైతం విఫలమవుతోందని మోదీ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో జీ 20 దేశాలు కలిసి కట్టుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రధాని మోదీ సూచించారు.

భారత్ ఎప్పుడు కూడా ప్రపంచ శాంతినే కోరుకుంటుందని మోదీ స్పష్టం చేశారు. శాంతి.. సామరస్యం.. భదత్రను పటిష్టం చేసుకునేందుకు జీ 20 దేశాలు గౌతమ బుద్దుడు.. మహాత్మా గాంధీ చూపించిన మార్గంలో పయనించాలని సూచించారు. ఇక వచ్చే ఏడాది జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.

ఈ నేపథ్యంలో ఈ సదస్సు ముగింపు వేడుకల్లో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో భారత్ కు జీ 20 అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ 20 దేశాల అధినేతలను వ్యక్తిగతంగా ఈ సదస్సుకు హాజరు కావాల్సిందిగా కోరనున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.