Begin typing your search above and press return to search.

మోడీకి మళ్లీ సీనియర్లే దిక్కయ్యారు..

By:  Tupaki Desk   |   5 Jun 2018 11:14 AM GMT
మోడీకి మళ్లీ సీనియర్లే దిక్కయ్యారు..
X
ఓడలు బండ్లు - బండ్లు ఓడలు కావడమంటే ఇదే.. 2014లో అఖండ మెజార్టీతో బీజేపీని ఒంటిచేత్తో గెలిపించిన ప్రధాని మోడీ ఇప్పుడు 2018కి వచ్చిసరికి తేలిపోతున్నారు. తన మొండి పట్టుదలతో అందరినీ దూరం చేసుకుంటున్న మోడీకి ఇప్పటికీ కానీ తత్వం బోధపడినట్టు అర్థమవుతోంది.

తాజాగా భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అడ్వానీని ప్రధానమంత్రి నరేంద్రమోడీ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఢిల్లీలో ఇంటికి వెళ్లి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వయసు అయిపోయిన 70 ఏళ్లు దాటిన బీజేపీ నేతలను ఇంటికి పంపిన మోడీ-షాల ద్వయం ఇప్పుడు మళ్లీ అదే కురువృద్ధుల వద్దకు వెళ్లి శరణు వేడడం ఢీల్లీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఎన్టీఏ నుంచి ప్రాంతీయ పార్టీలు వైదొలగడం.. మిగతా పార్టీలు కూడా దూరమవడంపై అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీలకు మోడీ-షాలు వివరించినట్టు తెలిసింది. తెలుగుదేశం వైదొలిగిందని.. మహారాష్ట్ర లో శివసేన, బీహార్ లో జనతాదళ్ యూనైటెడ్ కూడా ఎన్డీఏపై అసంతృప్తితో ఉండటాన్ని చర్చించినట్లు తెలిసింది. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి పోటీచేయాలనుకుంటున్నాయని.. వారిని ఎదుర్కొనేందుకు సాయం చేయాలని అడ్వాణీని కోరినట్లు తెలిసింది. అడ్వాణీ - మురళీ మనోహర్ జోషీలను తిరిగి 2019 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీచేయాలని మోడీ-షా కోరినట్టు సమాచారం.