Begin typing your search above and press return to search.

పాకిస్తానీలకు భారత పౌరసత్వం ఇచ్చే దమ్ము మీకుందా?

By:  Tupaki Desk   |   17 Dec 2019 11:36 AM GMT
పాకిస్తానీలకు భారత పౌరసత్వం ఇచ్చే దమ్ము మీకుందా?
X
తాజాగా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశం వ్యాప్తంగా నిరసనలు - ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రధాని మోడీ.. పౌరసత్వ సవరణ చట్టం వల్ల భారత పౌరులెవరూ నష్టపోరని - దీనిపై ముస్లింలు గానీ - మరొకరుగానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని - ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి భరోసా ఇచ్చారు.

ఈ కొత్త చట్టంలో ఉన్న అభ్యంతరాలను పరిశీలించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని .. విద్యార్థులని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలు కుట్రలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బర్‌ హైత్‌ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.

పౌరసత్వ చట్టంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ అబద్ధాలు చెబుతున్నాయని - ఆ చట్టం అమల్లోకి వస్తే ముస్లింలకు నష్టం జరుగుతుందంటూ లేనిపోని భయాలు పుట్టించే ప్రయత్నం చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు.ముస్లింలను కాంగ్రెస్ భయపెడుతున్న తీరును ‘గొరిల్లా పాలిటిక్స్‘గా అభివర్ణించిన మోదీ.. ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొట్టడం వల్లే జామియా వర్సిటీ - ఇతర ప్రాంతాల్లో హింస చోటు చేసుకుందని చెప్పారు. ‘

సీఏఏపై తప్పుడు ప్రచారం చేస్తున్న పార్టీలకు నేను సవాల్ విసురుతున్నా.. మీకు దమ్ముంటే పాకిస్తాన్ పౌరులందరికీ భారత పౌరసత్వం ఇస్తామని చెప్పండి.. జమ్మూకాశ్మీర్ లో రద్దయిపోయిన ఆర్టికల్ 370ని మళ్లీ అమలు చేస్తామని అనండి అంటూ ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఏఏపై లేనిపోని భయాలు ప్రచారం చేస్తున్న పార్టీలను నమ్మి విద్యార్థులు ఆగంకావొద్దని ప్రధాని కోరారు. విద్యార్థుల ముసుగులో అర్బన్ నక్సలైట్లు - సంఘవిద్రోహ శక్తులు హింసకు పాల్పడుతాయని - వారి పట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.