Begin typing your search above and press return to search.

అమెరికా పర్యటనకు బయల్దేరిన మోదీ .. ఆ భేటీనే కీలకం

By:  Tupaki Desk   |   22 Sep 2021 12:30 PM GMT
అమెరికా పర్యటనకు బయల్దేరిన మోదీ .. ఆ భేటీనే  కీలకం
X
ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ రోజు ఉదయం 11.15 గంటల సమయంలో ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మోడీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా తదితరులు ఈ అమెరికా ప్రయాణమయ్యారు. ప్రధాని బయలుదేరే ముందు తన పర్యటనపై ఒక ప్రకటన విడుదల చేశారు. తాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు ఆ దేశం వెళ్తున్నానని, అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చిస్తామని మోడీ తెలిపారు.

ఈ నెల 22 నుంచి -25 వరకు అమెరికా పర్యటన కొనసాగుతుందని చెప్పారు. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌ ను కూడా కలవనున్నట్లు చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో సహకారం గురించి ఆమెతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. అమెరికాతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంలో ఈ పర్యటన దోహదపడుతుందని భావిస్తున్నానని తెలిపారు. అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ క్వాడ్ నేతలతో ప్రత్యక్షంగా భేటీ కానున్నారు.

ఈ స‌మావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడ‌న్‌, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జ‌పాన్ ప్రధాని యోషిహిదే సుగాతో కలిసి భార‌త ప్రధాని మోదీ పాల్గొన‌నున్నారు. ఈ మార్చిలో జో బైడన్ వర్చువ‌ల్‌గా క్వాడ్ నేతల శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించారు. వైట్‌హౌస్‌లో బైడెన్‌తో జరిగే సమావేశంలో భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించనున్నట్టు మోదీ తన ప్రకటనలో వెల్లడించారు.

ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని ప్రసంగించనున్నారు. కరోనా వైరస్ మహమ్మారి, తీవ్రవాదం, వాతావరణ మార్పుల వంటి అంతర్జాతీయ సవాళ్ల గురించి ఐరాస ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు చెప్పారు. ఇంకా ఈ పర్యటనలో అమెరికా ఉపాధ్యాక్షురాలు కమలా హారిస్‌తో చర్చించనున్నారు. ప్రముఖ యూఎస్‌ కంపెనీల సీఈఐలతో కూడా మోదీ భేటీ కానున్నారు. ఇక, మోదీ సెప్టెంబర్ 26న తిరిగి ఇండియో చేరుకోనున్నారు.