Begin typing your search above and press return to search.

జ‌మిలి ఎన్నిక‌ల‌తో మోదీ ముంద‌స్తు వ్యూహం!

By:  Tupaki Desk   |   16 April 2017 5:40 AM GMT
జ‌మిలి ఎన్నిక‌ల‌తో మోదీ ముంద‌స్తు వ్యూహం!
X
ఇటీవ‌ల ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బీజేపీ మంచి ఫ‌లితాలు సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిస‌లాడుతోంది. మొత్తం ఐదు రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు జ‌రిగితే... ఒక్క పంజాబ్ మిన‌హా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్ర‌భుత్వాలను ఏర్పాటు చేయ‌గ‌లిగింది. వీట‌న్నింటిలోకి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పాల‌నా ప‌గ్గాల‌ను ఆ పార్టీ చాలా కాలం త‌ర్వాత త‌న హ‌స్త‌గ‌తం చేసుకుంది. ఈ ఒక్క విజ‌య‌మే... బీజేపీ శ్రేణుల్లోనే కాకుండా ఆ పార్టీ అధినాయ‌క‌త్వంలోనూ స‌రికొత్త ఉత్సాహాన్ని నింపింద‌ని చెప్పాలి. ఇక ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అయితే... ఈ ఫ‌లితాల‌ను గుర్తు చేసుకుంటూ విజ‌యోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో త‌న‌కు అన్నీ అనుకూలాంశాలు ఉన్నాయ‌ని భావిస్తున్న మోదీ... ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

నిన్న ప్రారంభ‌మైన బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల వేదిక‌పై మాట్లాడిన ప్ర‌తి నేత మోములోనే స్ప‌ష్టంగా ఈ విష‌య‌మే క‌నిపించింది. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కైతే వెళుతున్న‌ట్లు అటు మోదీ గానీ, ఇటు ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా గానీ ప్ర‌క‌టించ‌క‌పోయిన‌ప్ప‌టికీ... జాతీయ‌ - ప్రాంతీయ ప‌త్రిక‌ల‌న్నీ... మోదీ మ‌న‌సులోని మాట‌ను ప్రాతిప‌దిక‌గా చేసుకుని ప‌తాక శీర్షిక‌ల‌తో వార్తా క‌థ‌నాల‌ను రాసేశాయి. ఈ క‌థ‌నాల సారాంశంలోకి వెళితే... అన్నీ సానుకూల అంశాలే ఉన్న నేప‌థ్యంలో గ‌డువు కంటే కంటే ఏడాది ముందుగా ఎన్నిక‌ల‌కు వెళితేనే మంచిదని మోదీ భావిస్తున్నార‌ట‌. అంతేకాకుండా... ఒక దేశం- ఒకేసారి ఎన్నిక‌లు పేరిట గ‌తంలో మోదీ ప్ర‌క‌టించిన ఎన్నిక‌ల క్ర‌తువుకు కూడా నాందీ ప‌ల‌కాల‌నే బీజేపీ యోచిస్తోంది. ఇలా చేస్తేనే అటు కేంద్రంలో రెండో ప‌ర్యాయం అధికారం చేతికంద‌డంతో పాటు చాలా రాష్ట్రాల్లో పాల‌నా ప‌గ్గాలు కూడా త‌మ‌కే ద‌క్కుతాయ‌న్న‌ది బీజేపీ వాద‌న‌గా చెబుతున్నారు. పార్ల‌మెంటుకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఒకేసారి ఎన్నిక‌లు జ‌రిగితే అంద‌రికీ మంచిదేన‌న్న అభిప్రాయం ఉన్నా... ఇది ఏ మేర‌కు సాధ్య‌ప‌డుతుంద‌న్న దానిపైనే ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే జ‌మిలి ఎన్నిక‌లు దేశానికి కొత్తేమీ కాద‌ని చెబుతున్న నిపుణులు... 1970 ద‌శకం దాకా దేశంలో జ‌మిలి ఎన్నిక‌లే జ‌రిగిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. నేటి వార్తా ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మైన క‌థ‌నాల‌న్నింటినీ ఓ సారి ప‌రిశీలిస్తే.. ముంద‌స్తు ఎన్నికకే మోదీ మొగ్గుచూపుతున్న‌ట్లుగా ఉంది. అంటే 2019లో జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లు ఓ ఏడాది ముందుగా వ‌చ్చే ఏడాది (2018)లోనే జ‌రుగుతాయ‌న్న మాట‌. ఇదే జ‌రిగితే... మోదీ విజ‌యం సాధించ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంద‌న్న కోణంలోనే పెద్ద సంఖ్య‌లో వార్త‌లు ప్ర‌చురిత‌మ‌య్యాయి. మోదీ వ్యూహం బీజేపీ ప్ల‌స్‌ గానే నిలుస్తున్నా... ఆయా రాష్ట్రాల్లో ప్ర‌త్యేకించి ద‌క్షిణాది రాష్ట్రాల్లో బ‌లంగా ఉన్న ప్రాంతీయ పార్టీల‌కు ఏ మేర లాభిస్తుందో చూడాలి. జ‌మిలి ఎన్నిక‌లతో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు మోదీ సై అంటే... ప్ర‌స్తుతం అంత‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోతున్న రాష్ట్రాల్లోనూ బీజేపీ స‌త్తా చాటే అవ‌కాశాలే మెండుగా ఉన్నాయ‌న్న ప్ర‌చారం కూడా జోరుగానే సాగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/