Begin typing your search above and press return to search.

బీజేపీకి ప్రధాని మోడీ ఇచ్చిన విరాళం ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   26 Dec 2021 12:30 AM GMT
బీజేపీకి ప్రధాని మోడీ ఇచ్చిన విరాళం ఎంతో తెలుసా?
X
ప్రపంచంలోనే శక్తిమంతమైన నేతల్లో భారత ప్రధాని టాప్ లో ఉన్నారు. ప్రధానిగా చేస్తున్న వ్యక్తికి జీతభత్యాలు లక్షల్లోనే ఉంటాయి. ఇక అసలు డబ్బులు సమస్యే కాదు.. రోజుకో రంగు తన మార్క్ కుర్తా పైజామా వేసుకునే మోడీకి రూ.1000 లెక్కే కాదు.. పైగా దేశాన్ని పాలిస్తున్న పార్టీకి ఆయనే పెద్ద దిక్కు. ఆయన చేతుల మీదుగానే పార్టీ నడుస్తోంది. అలాంటి మోడీ కేవలం రూ.1000 అంటే వెయ్యి రూపాయలు మాత్రమే తన పార్టీకి విరాళం ఇచ్చి దేశ ప్రజలంతా ఇవ్వాలని కోరడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

తాజాగా బీజేపీకి ప్రధాని నరేంద్రమోడీ రూ.1000 విరాళం ఇచ్చారు. ఈమేరకు పార్టీకి ఇచ్చిన ఈ చిన్న మొత్తాన్ని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో బుధవారం షేర్ చేశారు. బీజేపీకి విరాళం ఇచ్చి పార్టీని మరింత బలోపేతం చేయాలని.. అాగే దేశాన్ని బలోపేతం చేసేందుకు సహకరించాలని మోడీ ట్వీట్ చేశారు. పార్టీ ఫండ్ కోసం ఈ మొత్తాన్ని అందించినట్లు మోడీ పేర్కొన్నారు.

భారతీయ జనతా పార్టీకి ఫండ్ కోసం రూ.1000 అందించాను. మీ చిన్న విరాళం ద్వారా జీవితాంతం నిస్వార్థ సేవ చేసే సంస్కృతి గల మా కేడర్ మరింత బలోపేతం అవుతుంది. బీజేపీని మరింత బలోపేతం చేయడంలో సహకరించండి.. అలాగే దేశాన్ని మరింత బలోపేతం చేయడానికి కూడా సహకరించండి’ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

ఇక కేంద్రహోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సైతం పార్టీకి రూ.1000 రూపాయలు విరాళం అందించడం విశేషం. నమో యాప్ ద్వారా ఈ విరాళాలు అందివ్వాలని కోరారు.

దేశంలోనే పవర్ ఫుల్ వ్యక్తులు.. చేతుల్లో అధికారం , డబ్బు కూడా ఉన్న ఇంతటి గొప్ప వారు కేవలం రూ.1000 విరాళం ఇవ్వడం ఏంటని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ప్రధాని హోదాలో ఉండి ఒక పార్టీ కోసం విరాళాలు ఇవ్వాలని పిలుపునివ్వడం కరెక్ట్ కాదని పలువురు హితవు పలుకుతున్నారు. అంతేకాకుండా బీజేపీ బలోపేతాన్ని దేశంతో పోల్చడం సరికాదని నిలదీస్తున్నారు.