Begin typing your search above and press return to search.

భేటీ వేళ పోప్ ను ఆలింగనం చేసుకున్న మోడీ ఆయనకేం ఇచ్చారు?

By:  Tupaki Desk   |   31 Oct 2021 7:19 AM GMT
భేటీ వేళ పోప్ ను ఆలింగనం చేసుకున్న మోడీ ఆయనకేం ఇచ్చారు?
X
జీ20 దేశాల సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ.. వాటికన్ సిటీకి వెళ్లి ప్రఖ్యాత రోమన్ కేథలిక్ చర్చిని సందర్శించారు. అంతేనా.. పోప్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పోప్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకోవటం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన ఫోటోల్ని మోడీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. అంతేకాదు.. తన భేటీ సందర్భంగా.. వీలైనంత త్వరగా భారత్ పర్యటనకు రావాలని ఆయన కోరారు.

ఈ ఆహ్వానాన్ని పోప్ స్వీకరించారని.. దాదాపు గంటపాటు వీరి మధ్య సమావేశం సాగింది. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. షెడ్యూల్ ప్రకారం వీరి భేటీ కేవలం 20 నిమిషాలు పాటు మాత్రమే సాగాల్సి ఉంది. అందుకు భిన్నంగా గంట పాటు సాగటం విశేషం. సాధారణంగా ప్రముఖుల మధ్య భేటీలు షెడ్యూల్ తప్పకుండా సాగుతాయి. ఒకవేళ.. ఐదు.. పది నిమిషాలు అదనంగా సాగుతాయి. అందుకు భిన్నంగా ముందుగా నిర్ణయించిన సమయానికి మూడు రెట్లు ఎక్కువ సమయం వీరిద్దరు గడపటం విశేషంగా చెప్పాలి.

భేటీ వేళ.. భారత్ 100 కోట్ల కొవిడ్ డోసుల్ని అందించిన ఘనతను తెలియజేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. పోప్ తో తాజా భేటీ సందర్భంగా మోడీ మరో రికార్డును క్రియేట్ చేశారు. ఇప్పటివరకు దేశ ప్రధానులుగా వ్యవహరించిన వారిలో పోప్ ను కలిసిన వారిలో మోడీ ఐదో ప్రధానిగా చెప్పాలి. ఆయనకు ముందు జవహార్ లాల్ నెహ్రూ.. ఇందిరాగాంధీ.. ఐకే గుజ్రాల్.. అటల్ బిహారీ వాజ్ పేయిలు ఉన్నారు. పదేళ్లు ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ ఈ జాబితాలో లేకపోవటం గమనార్హం.
ఇదిలా ఉండగా.. త్వరలోనే భారత్ పర్యటనకు పోప్ రావాలన్న ప్రధాని మోడీ అకాంక్షను మన్నించి ఆయన పర్యటన ఖరారైతే.. తన హయాంలో పోప్ ను కలవటమే కాదు.. ఆయన్ను దేశానికి తీసుకొచ్చిన ఘనత మోడీకే దక్కతుంది. చివరి సారిగా భారత్ కు పోప్ స్థానంలో ఉన్న ప్రముఖుడు వచ్చింది 1999లోనే. అప్పటి పోప్ జాన్ పాల్ 2 భారత్ పర్యటనకు వచ్చారు. అప్పటి నుంచి దాదాపు 22 సంవత్సరాలుగా పోప్ స్థానంలో ఉన్న వారెవరూ భారత్ పర్యటనకు రాలేదు.

ఇక.. పోప్ ను కలిసిన సందర్భంలో ఆయనకు పలు బహుమతుల్ని ఇచ్చారు మోడీ. వెండితో ప్రత్యేకంగా తయారు చేసిన కొవ్వొత్తుల స్టాండ్ (క్యాండెలాబ్రా)తో పాటు వాతావరణ మార్పులపై భారత్ తీసుకుంటున్న చర్యలపై రూపొందించిన 'ది క్లైమెట్ క్లైంబ్' పుస్తకాన్ని అందజేశారు. దీనికి ప్రతిగా ప్రధాని మోడీకి పోప్ సైతం బహుమానాల్ని అందించారు. ఒక కాంస్య ఫలకం..ప్రపంచ శాంతి సందేశాలతో కూడిన పత్రాల్ని అందచేసినట్లుగా చెబుతున్నారు.