Begin typing your search above and press return to search.

మీ ఇంటికి వ‌స్తే..దోసెలు వేస్తావా - మోడీ

By:  Tupaki Desk   |   29 May 2018 6:25 AM GMT
మీ ఇంటికి వ‌స్తే..దోసెలు వేస్తావా - మోడీ
X
త్యాగం ఒక‌రిది పేరు మ‌రొక‌రిది. ఇదెలానో మోడీకి తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీదేమో? దేశ ప్ర‌జ‌ల్ని త్యాగాల మీద త్యాగాల‌కు సిద్ధం చేసి.. వారి త్యాగాల మీద విలాసంగా న‌డిచే పాల‌కులు చాలామందే క‌నిపిస్తారు. ప్ర‌ధాని మోడీ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌జ‌ల్ని త్యాగాల దిశ‌గా అడుగు వేయించ‌టం కాదు.. ప‌రుగులు పెట్టించ‌టంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి.

ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత‌.. సంప‌న్నులు త‌మ‌కు అందే గ్యాస్ స‌బ్సిడీని వ‌దులుకుంటే.. వారి ప్ర‌యోజ‌నాన్ని దేశంలోని పేద మ‌హిళ‌ల‌కు గ్యాస్ క‌నెక్ష‌న్ల‌తో ఇస్తాన‌ని ప్ర‌క‌టించ‌టం తెలిసిందే. మోడీ మాట‌కు పెద్ద ఎత్తున స్పంద‌న రావ‌టం.. దేశ ప్ర‌జ‌లు కోట్లాది మంది స్వ‌చ్ఛందంగా తమ గ్యాస్ స‌బ్సిడీని వ‌దులుకోవ‌టం తెలిసిందే. ఇలా త‌మ స‌బ్సిడీని త్యాగం చేసి.. పేద ప్ర‌జ‌ల‌కు గ్యాస్ క‌నెక్ష‌న్ల‌ను ఇప్పించి వారిని పేద‌లు గుర్తించినా గుర్తించ‌కున్నా.. ఆ క్రెడిట్ మాత్రం మోడీ సొంత‌మైంది.

గ‌డిచిన నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో దాదాపు 10 ల‌క్ష‌ల కుటుంబాల‌కు ఉచిత గ్యాస్ క‌నెక్ష‌న్ ను అందించారు. ఉజ్వ‌ల యోజ‌న ప‌థ‌కం కింద గ్యాస్ క‌నెక్ష‌న్లు అందుకున్న మ‌హిళ‌ల‌తో మోడీ ప్ర‌త్యేకంగా వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హంచారు. వారితో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా త‌మిళ‌నాడుకు చెందిన రుద్ర‌మ్మ అనే మ‌హిళ‌ను మోడీ ప‌లుక‌రించారు. గ్యాస్ సిలిండ‌ర్ వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగాలు పొందుతున్నారు? అని ప్ర‌శ్నించారు.

దీనికి స్పందించిన రుద్ర‌మ్మ.. గ‌తంలో వంట చాలా క‌ష్టంగా ఉండేద‌ని.. ఇప్పుడు సులువుగా మారింద‌ని చెప్పారు. దీంతో.. మోడీ క‌లుగ‌జేసుకొని నేను మీ ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు దోసెలు వేసి పెడ‌తావా? అంటూ ప్ర‌శ్నించ‌గా రుద్ర‌మ్మ ఆ మాట‌ల‌కు మురిసిపోయింది. అనంత‌రం ఒడిశాకు చెందిన మ‌రో మ‌హిళ‌తో మాట్లాడుతున్న వేళ‌.. గ్యాస్ క‌నెక్ష‌న్ వ‌చ్చిన త‌ర్వాత ఇంట్లో పిల్ల‌లు దేన్ని ఇష్టంగా తింటున్నార‌ని మోడీ ప్ర‌శ్నించారు. దానికి ఆమె బ‌దులిస్తూ.. మ్యాగీ న్యూడిల్స్‌.. చౌమియాన్.. చ‌ట్ ప‌టా అని పేర్కొన్నారు.

క‌శ్మీర్ కు చెందిన ఒక మ‌హిళ మాట్లాడుతూ.. మోడీ ప్ర‌ధానిగా ఉండాల‌ని తాము నిత్యం కోరుకుంటున్నామ‌ని.. రంజాన్ ప‌ర్వ‌దినాల్లో రోజూ ప్రార్థిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా మోడీ త‌న బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. త‌మ ఇంటి చుట్టు చాలా ముస్లిం కుటుంబాలు ఉండేవ‌ని.. చాలామంది త‌న‌తో చాలా స్నేహంగా ఉండేవార‌ని.. ముస్లిం స్నేహితులు త‌న‌కు చాలామంది ఉండేవార‌ని చెప్పారు. గ‌తం సంగ‌తి ఓకే.. మ‌రి ఇప్ప‌టిసంగ‌తి కూడా చెబితే బాగుంటుంది క‌దా మోడీజీ!